
ఎఫ్‌ఆర్‌ఎస్ సంపూర్ణంగా అమలు చేయాలి
నందిపేట్(ఆర్మూర్): పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందితోపాటు విద్యార్థుల హాజరుకు ఫేషి యల్ రికగ్నిషన్ సిస్టమ్(ఎఫ్‌ఆర్‌ఎస్)ను సంపూర్ణంగా అమలు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. నందిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని హెచ్‌ఎం మంజులకు సూ చించారు. అంతకుముందు పీహెచ్‌సీని తనిఖీ చేసి న కలెక్టర్, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను, అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలను పరిశీలించారు. గర్భిణులు స్థానికంగానే సుఖ ప్రసవాలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని మెడిక ల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్‌కు సూచించారు. హైరిస్క్ కేసులను సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులకు రిఫర్ చేయాలన్నారు. స్కానింగ్ సెంటర్లపై నిఘా ఉంచాలని, ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యాక్సినేషన్, టీబీ ముక్త్‌భారత్ అభియాన్ అమలు, గ్రామాల్లో ఆరోగ్య శిబిరాల నిర్వహణ తదితర కార్యక్రమాల అమలుపై ఆరా తీశారు. అనంతరం ఎరువుల గోదామును తనిఖీ చేశారు. రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని మండల వ్యవసాయాధికారి రాంబాబు, గో డౌన్ నిర్వాహకుడు కార్తిక్‌ను ఆదేశించారు. పశువైద్యశాలను సందర్శించి పశువులకు వ్యాధి నిరోధక టీకాలు, కృత్రిమ గర్భధారణ తదితర సేవలపై పశువైద్యాధికారి నితీశ్ వర్మను అడిగి తెలుసుకున్నారు. ఫైర్ స్టేషన్‌ను సందర్శించి విపత్తులు, అతివృష్టి సంభవించినప్పుడు సత్వరమే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని స్టేషన్ ఆఫీసర్ నర్సింగ్‌రావును ఆదేశించారు.
నర్సరీ మొక్కలపై సంతృప్తి
మండల కార్యాలయం ఆవరణలోని నర్సరీలో మొక్కలు ఆరోగ్యంగా ఉండడాన్ని చూసి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎంపీడీవో శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతి గురించి ఆరా తీశారు. ఈ నెల 13న మార్కింగ్ మేళాలో లబ్ధిదారులందరూ మార్కింగ్ పూర్తి చేసుకునేలా చూడాలన్నారు. అనంతరం తహసీల్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతిపై సమీక్షించారు. ఆర్జీల పరిష్కారంలో జాప్యం జరుగకుండా చూడాలని తహసీల్దార్ సతీశ్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
విద్యార్థులకు నాణ్యమైన
భోజనాన్ని అందించాలి
నందిపేటలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు