
అత్యవసరమైతేనే బయటికి రండి
నిజామాబాద్ అర్బన్: రానున్న రెండు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అ న్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించా రు. ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎక్కడ కూడా ఏ చిన్న అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టర్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్‌లతో నిర్వహించి, జాగ్రత్తలు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై దిశానిర్దేశం చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి మొదలుకుని జిల్లా పంచాయతీ అధికారి వర కు, ఆశాలు, ఏఎన్‌ఎంల నుంచి జిల్లా వైద్యారోగ్య అధికారి వరకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అందరూ స్థానికంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితి కారణంగా సెలవులను కూడా రద్దు చేసినట్లు తెలిపారు. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటికి రావాలని ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తిన సమయాలలో చేపట్టే సహాయక చర్యలపై ప్రజలకు భరోసా కల్పించేలా నిజామాబాద్ నగరంతోపాటు బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ పట్టణాల్లో ఆయా వార్డుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. గతంలో వరద ప్రభావానికి గురైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఇదివరకు ఏర్గట్ల మండలం తడ్‌పాకల్ గోదావరి పరీవాహక ప్రాంతంలో పలువురు వరద ప్రవాహంలో చిక్కుకున్న ఘటనను కలెక్టర్ గుర్తు చేశారు. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్‌ల ను ఏర్పాటు చేయాలన్నారు. విద్యు త్, రెవెన్యూ, పోలీసు, ఆర్‌అండ్ బీ, పంచాయితీరాజ్, ఇరిగేషన్, వైద్యారోగ్యం, వ్యవసాయ తదితర శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ, జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అధికారులు, సిబ్బంది
అందుబాటులో ఉండాలి
మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు
భారీ వర్ష సూచన నేపథ్యంలో
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష
జాగ్రత్తలు, సహాయక చర్యలపై
యంత్రాంగానికి దిశానిర్దేశం