
విద్యుత్ కంట్రోల్ రూం ఏర్పాటు
సుభాష్‌నగర్: మూడు రోజులపాటు అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో విద్యుత్ సరఫరాపై వినియోగదారులు, రైతులు అత్యంత జాగ్రత్త వహించాలని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ రాపెల్లి రవీందర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు లోడ్ మానిటరింగ్ చేస్తున్నామని, మెన్, మెటీరియల్ అందుబాటులో ఉంచామని తెలిపారు. మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ వాహనాలను సిద్ధం చేశామని, ఉద్యోగులకు షిఫ్ట్ విధానంలో 24 గంటల విధులు కేటాయించామని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే పునరుద్ధరించేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. విద్యుత్ ప్రమాదాల నివారణ, అంతరాయాల సమస్య పరిష్కారం కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, 87124 85205 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు. తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తాకొద్దని, ప్రమాదకరంగా ఉన్నట్లు గమనించిన వెంటనే సంబంధిత విద్యుత్ సిబ్బందికి, టీజీఎన్‌పీడీసీఎల్ టోల్ ఫ్రీ నెంబర్ 1912కు సమాచారం అందించాలని కోరారు. ప్రధానంగా రైతులు మో టార్లు, పైపులు, ఫుట్ వాల్వులను ఏమరపాటుతో తాకొద్దని, వ్యవసాయ పంపుసెట్లు, స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయాలని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద అనధికారికంగా మరమ్మతులు చేయొద్దని, పనులేమైనా ఉంటే విద్యుత్ సిబ్బందికి సమాచారమివ్వాలని ఎస్‌ఈ కోరారు.
కరెంట్ సరఫరాపై జాగ్రత్త వహించాలి
మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ వాహనాలు సిద్ధం
ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ రవీందర్

విద్యుత్ కంట్రోల్ రూం ఏర్పాటు