న్యూస్‌రీల్
నిర్మల్
గణేశ్ మండపాల్లో సీసీ
కెమెరాలు ఏర్పాటు చేయాలి
ఖానాపూర్: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలని నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ సూచించారు. ఎస్పీ జానకీషర్మిల ఆదేశాల మేరకు ఖానాపూర్ మండలం మస్కాపూర్‌లో ఖానాపూర్ పట్టణంతోపాటు మండలం గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతో శనివారం సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసుల సూచనలు పాటించాలని తెలిపారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉత్సవాల ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అనుమతి లేకుండా డీజేలు ఏర్పాటు చేయవద్దని పేర్కొన్నారు. సమావేశంలో ఖానాపూర్ సీఐ సత్యనారాయణ, ఎస్సై రాహుల్ గైక్వాడ్ , హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు మంత్రరాజ్యం సురేశ్, కార్యదర్శి శెట్టి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
రెండు రోజులుగా వాతావరణం మారిపోయింది. మొన్నటి వరకు భగ్గుమన్న భానుడు చల్లబడ్డాడు.. ఆకాశం మేఘావృతమవుతోంది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పంటలకు చిరు జల్లులు ఊపిరి పోస్తున్నాయి. చినుకులకు కొత్త చిగురు మురిసిసోతోంది.. పశుపక్షాదులు చిందులేస్తున్నాయి.. ఇదంతా ఆది దేవుడు గణనాథుడికి రాకకు సంకేతంగా నిలుస్తోంది. బొజ్జ గణపయ్య మరి కొన్ని గంటల్లో మండపాల్లో కొలువుదీరనున్నాడు. వినాయకుడి రాకతో వర్షాలు కురుస్తాయని, చెరువులు మత్తడి దూకుతాయని, ప్రాజెక్టులు నిండుతాయని భక్తుల నమ్మకం. ఈసారి ఎల్‌నినో పరిస్థితులతో జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో దివి నుంచి భువికి వస్తున్న గణనాథుడు వరుణ దేవుడిని కూడా తీసుకురావాలని జిల్లావాసులు కోరుతు న్నారు. ఈ నేపథ్యంలో గణనాథుడు భువికి వచ్చే ముందు భక్తుడితో మాట్లాడితే ఇలా ఉంటుంది. – నిర్మల్


