కర్ర గణేశుడు.. పర్యావరణ హితుడు | - | Sakshi
Sakshi News home page

కర్ర గణేశుడు.. పర్యావరణ హితుడు

Sep 13 2026 12:06 AM | Updated on Sep 13 2026 12:06 AM

● సరిహద్దు గ్రామాల్లో కొనసాగుతున్న సంప్రదాయం

భైంసా: మహారాష్ట్ర సరిహద్దులోని కొన్ని గ్రామాల్లో వినాయక ప్రతిష్టలో ప్రత్యేకత ఉంది. ఇక్కడ రంగులు, హంగులు, ఆడంబరం లేవు. సమాజహితం, ప ర్యావరణ పరిరక్షణే ప్రధాన లక్ష్యం. పూర్వీకుల మార్గాన్ని అనుసరిస్తూ ఈ గ్రామాల ప్రజలు కేవలం కర్రతో చేసిన వినాయక విగ్రహాలనే ప్రతిష్టిస్తా రు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌(పీవోపీ), రసాయనిక రంగుల ప్రతిమలు గానీ మట్టి విగ్రహాలు గానీ కనిపించవు. నిమజ్జనం అనే సంప్రదాయం కూడా లేదు.

పాలజ్‌ గణేశ్‌ ప్రసిద్ధి

తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని చిన్న మరాఠీ గ్రామం పాలజ్‌. కుభీర్‌కు సమీపంలో మహారాష్ట్ర బోకర్‌ తాలూకాలో ఉంది. స్వాతంత్య్రానికి ముందు ఈ గ్రామంలో కలరా, ప్లేగు వ్యాధులు వ్యాపించాయి. అదే సమయంలో వినాయక చవితి వచ్చింది. వ్యాధులు, కరువు పరిస్థితులతో ప్రజలు సతమతమయ్యారు. గ్రామ పెద్దలు కర్ర గణపతిని చేయించి ప్రతిష్టించాలని నిర్ణయించారు. నిర్మల్‌ కొయ్యబొమ్మల నకాషీ కళాకారుడు గుండాజీ వర్మను సంప్రదించారు. ఆయన చేసిన సుందరమైన కర్ర విగ్రహాన్ని ప్రతిష్టించి ఊరంతా మొక్కిన తర్వాత వ్యాధులు తొలగిపోయాయని, కరువు తీరిందని గ్రామస్తులు చెబుతారు. 1948 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఆ గ్రామ ఆడపడుచుల ద్వారా ఇతర ఊళ్లకు కూడా ఈ విషయం తెలిసింది.

నిమజ్జన విధానం

పూజల అనంతరం నిమజ్జన రోజున కర్ర గణేశుడిని స్థానిక వాగు వద్దకు తీసుకెళ్తారు. అక్కడ పూజలు జరిపి నీళ్లు చల్లి తిరిగి ఆలయానికి తీసుకువస్తారు. దీన్నే నిమజ్జనోత్సవంగా భావిస్తారు. తర్వాత విగ్రహాన్ని ఆలయంలోని బీరువాలో భద్రపరుస్తారు.

భారీగా భక్తుల రాక..

ఏటా వినాయక ఉత్సవాల్లో దాదాపు ఆరు నుంచి ఏడు లక్షల మంది భక్తులు పాల్గొంటారు. తిరుపతి, షిర్డీల్లోలా ఇక్కడ కూడా క్యూలైన్లు ఏర్పడతాయి. లక్షలాది భక్తులకు గ్రామస్థులే కలిసికట్టుగా సేవలు అందిస్తారు.

ఇతర కర్ర గణపతులు

తానూరు మండలం బోసిలో వరసిద్ధి కర్ర వినాయకుడు, కుభీర్‌ మండలం కుభీర్‌, పార్డి, మాలేగాం చిక్లీ, భైంసా మండలం మాటేగాం, లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్‌ గ్రామాల్లోనూ కర్ర గణపతులను ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. స్వాతంత్య్ర పోరాట కాలంలో కరువు నేపథ్యంలో గ్రామస్తుల మొక్కులతో ఈ ప్రాంతంలో కర్ర గణపతి ప్రతిష్ట ప్రారంభమైంది.

ఇలా చేరుకోవాలి..

హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌, బాసర మీదుగా భైంసా చేరుకుంటే దూరం తగ్గుతుంది. నిర్మల్‌ మీదుగా వచ్చేవారు కూడా భైంసా మీదుగానే పాలజ్‌కు వెళ్లాలి. భైంసా నుంచి 23 కిలోమీటర్ల దూరంలో పాలజ్‌ ఉంది. ఉత్సవాల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement