భైంసా: ఆంగ్లేయుల కాలంలో స్వాతంత్య్రం కోసం జాతీయ నాయకులు పోరాటాలు చేస్తున్నారు. బాలగంగాధర్ తిలక్ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రజలను సమైక్యంగా కలుపుకోవాలన్న లక్ష్యంతో ఆయన ముందుకు సాగారు. అప్పట్లో ఆంగ్లేయులు సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చేవారు కాదు. నలుగురు ఒకచోట కలుసుకోవడం కూడా కష్టమైంది. దీన్ని అధిగమించేందుకు తిలక్ ఒక ఉపాయం ఆలోచించారు. ఆ రోజుల్లో గణపతి పూజలు ఇళ్లలోనే జరుగుతుండేవి. ఏటా సార్వజనికంగా గణేశ్ విగ్రహాలు ప్రతిష్టిస్తే ప్రజలంతా ఒకే చోట సమావేశమై ఉత్సవాలు జరుపుకుంటారని ఆయన భావించారు. ఈ ఉత్సవాల నేపథ్యంలో దేశభక్తి, స్వాతంత్య్ర సందేశాలను చేరవేయవచ్చని అనుకున్నారు. అలా 1893లో మహారాష్ట్రలోని పుణేలో శ్రీకస్బా గణపతిని ప్రతిష్టించి సార్వజనిక గణేశ్ ఉత్సవాలను ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం వందల ఏళ్లుగా కొనసాగుతోంది.
కుభీర్‌లో ఉత్సవాలు ప్రారంభం
ఆ కాలంలో ముధోల్ ప్రాంతం నిజాం పరిపాలనలో ఉండేది. ఇది నాందేడ్ జిల్లా పరిధిలోకి వచ్చేది. దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న తిలక్ ప్రస్తుత నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ పరిధిలోని కుభీర్‌కు చేరుకున్నారు. అప్పటి కుభీర్ పాలకుడు యశ్వంత్‌రావు దేశ్‌ముఖ్ తిలక్‌కు దగ్గరి బంధువు. 1905లో భైంసాకు వచ్చిన తిలక్ పట్టణానికి చెందిన నారాయణ్ వాగ్‌తో సమావేశమయ్యారు. అదే సంవత్సరం కుభీర్‌లో గణేశ్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. యశ్వంత్‌రావు దేశ్‌ముఖ్ వీటిని నిర్వహించేవారు. 1950 నుంచి 40 ఏళ్లపాటు వైద్యనాథ్ ఈ బాధ్యతను నిర్వహించారు. ప్రస్తుతం గ్రామస్తులు కొనసాగిస్తున్నారు. ఇలా 121 ఏళ్లుగా కుభీర్‌లో ఉత్సవాలు జరుగుతున్నాయి.
భైంసాలో 107 ఏళ్లుగా..
భైంసా పట్టణంలో 1919లో సార్వజనిక గణేశ్ మండలివారు గోపాలకృష్ణ మందిరంలో నారాయణ్ వాగ్ సమక్షంలో మొదటిసారి ఉత్సవాలు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయి. నిమజ్జన రోజున ఇక్కడే పూజలు చేసి శోభాయాత్ర ప్రారంభిస్తారు. 1921లో హతి గణేశ్ మండలి కూడా ఉత్సవాలు ప్రారంభించింది. నేడు భైంసాలో వందకు పైగా గణేశ్ మండలీలు ఉత్సవాలు జరుపుకుంటున్నాయి. గతంలో అంతా కలిసి భజనలు చేస్తూ ఒకే చోట జరుపుకునేవారు. ప్రస్తుతం మండలీల సంఖ్య పెరిగినా సామూహిక భావన మాత్రం కొనసాగుతోంది.
1893లో మహారాష్ట్రలోని పుణేలో గణేశ్ ఉత్సవాలు ప్రారంభం
పుణేలో శ్రీకస్బ గణపతిని
ప్రతిష్టించిన బాలగంగాధర్ తిలక్
1905 నుంచి కొనసాగుతున్న కుభీర్ ఉత్సవాలు
1919లో భైంసాలో సార్వజనిక్ ఉత్సవాలు ప్రారంభం
1921లో హతి గణేశ్ ఉత్సవాలు ప్రారంభం


