ఆర్టీసీలో పదోన్నతులకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో పదోన్నతులకు వేళాయె

Aug 24 2026 7:21 AM | Updated on Aug 24 2026 7:21 AM

● ఏళ్లుగా కార్మికుల ఎదురుచూపు ● ఎట్టకేలకు కదిలిన అధికారులు ● విల్లింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల ● మొదలైన ప్రమోషన్‌ ప్రక్రియ

ఆదిలాబాద్‌: ఆర్టీసీలో పదోన్నతుల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న కార్మికులకు ఇక ఊరట లభించనుంది. రీజియన్‌ పరిధిలో పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ల ప్రక్రియ ఎట్టకేలకు మొదలవడంతో ఉద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సీనియారిటీ, అర్హతలు, ఖాళీల ఆధారంగా పదోన్నతి కల్పించేందుకు అధికారులు విల్లింగ్‌, అన్‌విల్లింగ్‌ కోసం 176 మంది జాబితాతో కూడిన నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఇందులో డ్రైవర్లు 65, కండక్టర్లు 111 మంది ఉన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం సెలవు రోజైనా పలువురి నుంచి విల్లింగ్‌ తీసుకున్నారు. ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

ప్రమోషన్‌ లేకుండానే పదవీ విరమణ

పదోన్నతి ప్రక్రియ ఆలస్యం కావడంతో పలువురు ఉద్యోగులు తాము చేరిన కేడర్‌లోనే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రమోషన్‌ ద్వారా లభించే వేతన పెంపు, ఇతర ప్రయోజనాలను కోల్పోతున్నారు. ముఖ్యంగా వయసు మీద పడిన ఉద్యోగులకు పదోన్నతి కల్పిస్తే ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది.

సీనియారిటీ, అర్హతల ఆధారంగా ..

ఆర్టీసీలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్‌, క్లరికల్‌ విభాగాల్లో సర్వీస్‌ నిబంధనలకు అనుగుణంగా పదోన్నతులు ఉంటాయి. డ్రైవర్లు, కండక్టర్లు సీనియారిటీ, అర్హతలు, ఖాళీల ఆధారంగా తదుపరి కేడర్‌కు ఎదిగే అవకాశం ఉంటుంది. ఏడీసీ, కంట్రోలర్‌, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ వంటి హోదాల్లోనూ ప్రమోషన్‌ కల్పించే అవకాశం ఉంది. మెకానికల్‌, క్లరికల్‌ విభాగాల్లోనూ ఆయా కేడర్లకు అనుగుణంగా పదోన్నతులు ఉంటాయి.

అధికారుల నిర్ణయంపై ఉత్కంఠ..

పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేసి అర్హులైన వారికి త్వరగా ప్రమోషన్లు కల్పించాలనే డిమాండ్‌ కార్మికుల నుంచి వినిపిస్తోంది. పదవీ విరమణకు చే రువలో ఉన్న ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు సీనియారిటీ ప్రకారం ఖాళీలను భర్తీ చేయాలనే విజ్ఞప్తులు ఉన్నాయి. రీజియన్‌ పరిధిలో పదో న్నతుల ప్రక్రియకు త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పారదర్శకంగా ప్రక్రియ

ఆర్టీసీలో పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇది పూర్తిగా పారదర్శకంగా కొనసాగుతోంది. ఖాళీలకు అనుగుణంగా ఉద్యోగుల సీనియారిటీ ఆధారంగా ప్రమోషన్లు కల్పిస్తాం. ఎటువంటి అవకతవకలకు తావు ఉండదు. పదోన్నతులతో పాటు ఉద్యోగుల విజ్ఞప్తులు, అవసరాలకు అనుగుణంగా బదిలీలు కూడా చేపడతాం. కౌన్సెలింగ్‌ నిర్వహించి మొత్తం ప్రక్రియను నాలుగు నుంచి ఐదు రోజుల్లో పూర్తయ్యేలా చూస్తాం. – విజయభాను,

ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌, ఆదిలాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement