మంచిర్యాలఅర్బన్: ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల వద్ద నుంచి వసూలు చేస్తున్న అన్ని ఫీజుల వివరాల సమగ్ర సమాచారం బహిర్గతపర్చాలని విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ అన్–ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి తరగతుల వారీగా వసూలు చేసే ఫీజుల వివరాలను నోటీస్ బోర్డుతో పాటు పాఠశాల వెబ్‌సైట్, https: schooledu. telangana. gov. in వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా ప్రదర్శించాలని పాఠశాల విద్యా సంచాలకుడు నవీన్ నికోలస్ ఆదేశించారు. జీవో ఎంఎస్ నంబర్ –1 (1.01.1994) నిబంధనలు 16, 18 ప్రకారం గవర్నింగ్ బాడీ సభ్యుల సంతకాలతో ఫీజు నిర్ధారణ మద్దతు పత్రాలను కూడా అప్‌లోడ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫీజు వివరాలను ప్రదర్శించని పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
పారదర్శకత ఫీజులకు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, కుమురంభీం, నిర్మల్ జిల్లాల్లో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు 672 ఉన్నాయి. ఇందులో 44 ప్రైమరీ, 273 అప్పర్ ప్రైమరీ, 222 ఉన్నత పాఠశాలల్లో మొత్తం 1,32,308 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆయా పాఠశాలలు ఎంత ఫీజులు వసూలు చేస్తున్నాయో నోటీస్ బోర్డులు, వెబ్‌సైట్, ప్రభుత్వ విద్యాశాఖ పోర్టల్‌లో ప్రదర్శిస్తే అందరికీ అందుబాటులో ఉంటుంది. గవర్నరింగ్ ఆ మోదించిన అధికారి క పత్రాలను సమర్పించాల్సి ఉండడం వలన యాజమాన్యం ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచడానికి వీలుండదు. ఏ తరగతికి ఎంత ఫీజు కట్టాలో అడ్మిషన్ సమయానికే స్పష్టమైన సమాచారం లభిస్తుంది. నిబంధనలు పాటించని పాఠశాలల గుర్తింపు రద్దు వంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం లభిస్తుంది. ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట పడి నిర్వహణలో పారదర్శకత పెరగనుందని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.
ఆదేశాలు అమలయ్యేనా..?
టెక్నో, సీబీఎస్‌ఈ, ఐబీఎస్‌ఈ, ఐఐటీ, నీట్ ఫౌండేషన్ పేరిట తల్లిదండ్రులకు స్కూళ్ల ఫీజు భారం పెరిగిపోతుంది. పాఠశాల, ల్యాబ్, లైబ్రరీ, ట్యూషన్ ఫీజులంటూ వారిపై ఆర్థికభారం పడుతోంది. ఫీజుల సమాచారం లేకపోవడంతో పాఠశాలల యాజమాన్యాలు అడ్మిషన్ పొందినప్పుడు ఒక మాదిరి.. ఆ తర్వాత మరో మాదిరి ఫీజులు వసూలు చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు తమ ఫీజు వివరాలను నోటీస్ బోర్డులపై ప్రదర్శించాలని జిల్లా విద్యాశాఖ ఆదేశించినప్పటికీ వందల సంఖ్యలో ఉన్న పాఠశాలల్లో కనీసం రెండంకెల సంఖ్యలో కూడా యాజమాన్యాలు పాటించటం లేదు. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా ఆటస్థలాలు, ఇతర కనీస సౌకర్యాలు కల్పించడంలో అనేక పాఠశాలలు విఫలమయ్యాయి. విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు గుంజుతూ నోటీస్ బోర్డుపై ప్రదర్శించని పాఠశాలలు, అధికారిక విద్యాశాఖ వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేస్తాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల వివరాలు
జిల్లా ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత మొత్తం విద్యార్థులు
మంచిర్యాల 15 98 109 70,273
నిర్మల్ 15 126 84 43,783
కుమురంభీం 14 49 29 18,252


