లోకేశ్వరం: వ్యవసాయం రైతన్నకు భారమవుతోంది. పెట్టుబడులు పెట్టి అనుకున్న స్థాయిలో పంటలు పండకపోవడంతో అన్నదాతలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురవడంతో దేవుడిపై భారమేసి సాగుకు సన్నద్ధమవుతున్నారు. కరుణించని దేవుడికి కష్టాలు చెప్పుకొంటూ అరక చేతబట్టి పొలం బాట పడుతున్నారు.
జిల్లాలో పంటల సాగు ఇలా..
జిల్లాలో వానాకాలంలో వరి 1.40లక్షల ఎకరాలు, పత్తి 1,62,100 ఎకరాలు, సోయా 1,06,080 ఎకరాలు, మొక్కజొన్న 16వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. యాసంగిలో ఎదురైన నష్టాలను ఖరీఫ్‌లో పూడ్చుకోవాలని అన్నదాతలు పొలం పనుల్లో బిజీబిజీగా కనిపిస్తున్నారు. గత రబీలో భూగర్భజలాలు అడుగంటాయి. వేసిన వరి నాట్లు నీళ్లు లేక పోవడంతో ఎండిపోయాయి. దిగుబడి కాదు కదా.. కనీసం గడ్డి కూడా చేతికి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా వరి సాగు చేయడం.. పంట చేతికి వచ్చే సమయానికి అతివృష్టి లేదా అనావృష్టితో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు లక్ష ఎకరాల్లో వరి నాట్లు వేసేందుకు రైతులు దుక్కులు సిద్ధం చేసుకున్నారు. కొన్ని చోట్ల నాట్లు కూడా పూర్తి చేశారు.
అధికమైన పెట్టుబడి వ్యయం
వరి సాగుకు అయ్యే ఖర్చును భరించలేక రైతులు అయోమయానికి గురవుతున్నారు. దుక్కి దున్నడం మొదలుకుని నాట్లు వేసేదాకా ఎకరాకు సుమారు రూ.28వేల వరకు పెట్టుబడులు పెడుతున్నారు. ఎకరం దుక్కి దున్నడానికి రూ.5వేలు, కేజీవీల్స్‌కు రూ.4,500, విత్తనాలకు రూ.2వేలు వరి నాటుకు రూ.5,400, వరి కోతకు రూ.3,200, పంటను ఇంటికి తెచ్చేందుకు రూ.3వేలతో పాటు ఎరువులు, ఇతర ఖర్చుల కోసం రూ.5వేలు పెట్టాల్సి ఉంటుంది. ఇంత పెట్టుబడి పెట్టినా దిగుబడులు లేక గిట్టుబాటు ధర రాక రైతులు నష్టపోతున్నారు.
అప్పు చేసి సాగు చేస్తున్నాం
అప్పులు చేసి వరి సాగు చేస్తున్నాం. పొలం దున్నడానికి ఖర్చు ఎక్కువవుతోంది. రెండేళ్లగా ట్రాక్టర్ కిరాయి, ఎరువుల ధరలు మూడింతలు పెరిగాయి. ఈ స్థాయిలో మాత్రం వడ్లకు ధర పెరగడం లేదు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నాం.
– గీజా భోజన్న, ధర్మోర


