నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భవిష్యత్ అవసరాలకు నీటిని నిల్వ చేయాలి ‘కడెం’ను సందర్శించిన మంత్రుల బృందం
కడెం: కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరుకు రాష్ట్రంలోని ప్రాజెక్టుల పటిష్టతే నిదర్శనమని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి కడెం ప్రాజెక్టును శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రు హయాంలో నిర్మించిన ఎస్సారెస్పీ, 1949లో కట్టిన కడెం ప్రాజెక్టు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌డ్డి హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నేటికీ చెక్కుచెదరలేదని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ప్రారంభించిన మూడేళ్లకే కూలిపోయాయని విమర్శించారు.
నీటి నిర్వహణపై సూచనలు
భవిష్యత్ తాగు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుల్లో నీటిని ప్రణాళికాబద్ధంగా నిల్వ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ తెరపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తిస్థాయి నీటిమట్టం(ఎఫ్‌ఆర్‌ఎల్), ప్రస్తుత ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో, గేట్ల ద్వారా విడుదల చేస్తున్న నీటి పరిమాణం వంటి వివరాలు అందించారు. ఎల్‌నినో ప్రభావం, భవిష్యత్ నీటి అవసరాలను పరిగణనలోకి తీసుకొని శాసీ్త్రయ విధానాన్ని అనుసరించాలని మంత్రులు సూచించారు. ప్రాజెక్టుల నీటిమట్టాలు, పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తుందని తెలిపారు. కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, నీటిమట్టం, నిల్వ సామర్థ్యం, సిల్టేషన్ సమస్యలు, నీటి పారుదల నిర్వహణపై వివరించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటి వినియోగాన్ని శాసీ్త్రయంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
సిల్ట్ సమస్యపై ఆగ్రహం
ప్రాజెక్టులో సిల్ట్ పేరుకుపోయిందని ఇరిగేషన్ అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 7.5 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులో దాదాపు 50 శాతం వరకు పూడిక పేరుకుపోయినట్లు తెలిపారు. దీంతో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఎందుకు పనులు చేయడం లేదని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. పనులు చేపట్టకపోతే టెండర్ రద్దు చేయాలని ఆదేశించారు. నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో దీర్ఘకాలిక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. నీటిమట్టం 674–675 మీటర్లకు చేరినప్పుడు ప్రత్యామ్నాయ రోజుల్లో నీటి విడుదల చేసేలా ప్రణాళిక సిద్ధం చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. పూడికను దశలవారీగా తగ్గించి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు సాంకేతిక చర్యలు చేపడుతున్నామన్నారు.ఈ సందర్భంగా సదర్‌మట్ ఆయకట్టు రైతులు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డిని కలిసి బ్యారేజ్ నుంచి ప్రత్యేక కాలువ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా ఎస్పీ జానకీషర్మిల, అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


