నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఘన వ్యర్థాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలన్నారు. ప్లాస్టిక్ నిషేధం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పన పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్లు రవిబాబు, సుందర్ సింగ్, యాదయ్య, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జల సంరక్షణకు ఫారం పాండ్స్ తప్పనిసరి
కుంటాల: వ్యవసాయ భూముల్లో జల సంరక్షణ కోసం ఫారం పాండ్స్ తప్పనిసరిగా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. అంబుగామలో తాగునీటి సమస్య ఉందని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు మంగళవారం గ్రామాన్ని సందర్శించారు. రెండు ఎకరాలు భూమి కలిగిన ప్రతీ రైతు ఫారం పాండ్స్ నిర్మించుకుంటే భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని సూచించారు. ఎకరాకు ఒక ఫారం పాండ్ నిర్మిస్తే ఐదు లక్షల లీటర్ల నీరు భూమిలో ఇంకుతుందన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య ఉన్నందున తక్షణమే బోరుబావి మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామంలో విద్యుత్, టెలికాం, మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, డీపీవో శ్రీనివాస్, డీఆర్డీవో విజయలక్ష్మి, ఏపీడీ ఓస ప్రసాద్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ సందీప్, తహసీల్దార్ కమల్ సింగ్, ఎంపీడీవో అల్లాడి వనజ, సర్పంచ్ శివాజీ, తదితరులు పాల్గొన్నారు.


