నిర్మల్: తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ తెలంగాణ సంఘటన మంత్రి చంద్రశేఖర్ తివారీ అన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి, ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేస్తే విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. నిర్మల్‌రూరల్ మండలంలోని తల్వేదలో మంగళవారం జిల్లా అధ్యక్షుడు రితేశ్‌రాథోడ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలో పార్టీ విస్తరణకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలన్నారు. బూత్‌స్థాయి నుంచి సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలని సూచించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, ప్రజలు బీజేపీ వైపు ఆశతో చూస్తున్నారన్నారు. పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలో కూడా బీజేపీ విజయాన్ని నమోదు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌రావు, జిల్లా ఇన్‌చార్జి గోపిడి స్రవంతిరెడ్డి, మాజీ అధ్యక్షులు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్, భైంసా, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్లు దత్తాత్రి, మౌనిక, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లికార్జున్ రెడ్డి, నగర్ నారాయణరెడ్డి, మేడిసెమ్మె రాజు, పడిపెల్లి గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నల్లా రవీందర్ రెడ్డి, కరిపే విలాస్, తదితరులు పాల్గొన్నారు.


