పైచదువుల చింత | - | Sakshi
Sakshi News home page

పైచదువుల చింత

Jul 20 2026 11:42 PM | Updated on Jul 20 2026 11:42 PM

● ఉన్నత విద్యకు ఎన్నో అవస్థలు ● మధ్యలోనే ఆగిపోతున్న విద్యార్థులు ● పేద, మధ్యతరగతికి అందని పీజీ

చదువులమ్మ చెంత..

యూనివర్సిటీ ఉంటేనే చదువు ఈజీ

నిర్మల్‌: చదువులతల్లి జ్ఞానసరస్వతీ కొలువైన జిల్లాలో పైచదువులకు ఇబ్బందులు పడాల్సిన దుస్థితి. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పీజీ, పీహెచ్‌డీ, ఎంఫిల్‌, తదితర చదువుల కోసం హైదరాబాద్‌ వంటి దూరప్రాంతాలకు వెళ్లాల్సిందే. అబ్బాయిలు ఎలాగోలా వెళ్లి చదువుకుంటున్నా.. చాలామంది గ్రామీణ ప్రాంత అమ్మాయిలు చదవాలన్న ఆశ ఉన్నా.. దూరభారం కావడంతో మధ్యలోనే పైచదువుల ఆశలు వదులుకుంటున్నారు. రాష్ట్రంలోని దాదాపు అన్నిజిల్లాల్లో యూనివర్సిటీలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిర్మల్‌ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ యూనివర్సిటీల ఏర్పాటు ముందుకు కదలడం లేదు. వేలాదిమంది విద్యార్థుల పైచదువుల కలను ప్రభుత్వాలు సాకారం చేయడం లేదు.

ఆగుతున్న అమ్మాయిల చదువు..

ఆర్థికంగా బలమైన కుటుంబాలు తమ పిల్లలను బయటకు పంపుతున్నా.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు అది భారంగా మారుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థినుల ఉన్నతవిద్య కలలు చాలాసార్లు ఇంటి గడప దాటకుండానే ఆగిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా కుటుంబాలు తమ కుమార్తెలను దూర ప్రాంతాలకు పంపేందుకు వెనుకంజ వేస్తున్నాయి. పీజీ చదవాలన్న ఆసక్తి ఉన్నా భద్రత, వసతి, ఆర్థిక పరిస్థితులు, సామాజిక కారణాల వల్ల చాలామంది యువతులు డిగ్రీకే పరిమితం అవుతున్నారు. జిల్లాలోనే యూనివర్సిటీ ఉంటే ఇలాంటి ఎంతోమందికి ఉన్నతవిద్య అందుబాటులోకి వస్తుందని విద్యార్థులు, తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

ఉన్నవి మూసి.. కొత్తవి మరిచి..

జిల్లాలో గతంలో కాకతీయ యూనివర్సిటీ పీజీసెంటర్‌ ఉండేది. ఇప్పటికీ ఉంది.. కానీ అది నామ్‌ కే వాస్తేగా సాగుతోంది. ఒకప్పుడు వందలమంది విద్యార్థులతో సోషియాలజీ, ఎంఏ ఇంగ్లీష్‌ వంటి అరుదైన కోర్సులతో కళకళలాడేది. అలాంటి పీజీసెంటర్‌ను ఉందా..లేదా.. అనే స్థితికి తీసుకొచ్చారు. ఇక జిల్లాలో ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. జేఎన్‌టీయూ నుంచి జిల్లాలో ఓ కళాశాల పెట్టించాలని గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి నిర్మల్‌ సభలోనే తీసుకువస్తే.. అప్పుడు ఆదిలాబాద్‌కు ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత అదీ ముందడుగు పడలేదు. చాలాసార్లు పాలకుల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకునేవారు కరువయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement