
ఎస్సారెస్పీకి 20వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
మామడ: ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం 20వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 1079.80 అడుగుల నీటి మట్టం ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 44.49 టీఎంసీలుగా ఉంది. కాగా సరస్వతీ కాలువ కింద సాగు చేసిన పంటల కోసం 800 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
బాసర గోదావరిలో
భక్తుల మొక్కులు
బాసర: వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడంతో బాసర వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో నూతనంగా నీరు ప్రవహిస్తుండడంతో శ్రావణమాసం పురస్కరించుకొని భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి గోదారమ్మకు దీపాలు వదిలి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో వరద నీరు భారీగా వస్తోంది.
‘కార్మికుల శ్రమను దోచుకుంటున్న సంఘాలు’
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, బీఎంఎస్, టీబీజీకేఎస్ సంఘాలు యాజమాన్యంతో కుమ్మకై ్క సింగరేణి కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయని సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) కార్యదర్శి అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనేక వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల సమస్యలను విస్మరించిందని ఆరోపించారు. ఆదాయ పన్ను రద్దు, సొంతింటి కల, ప్రైవేటీకరణ అడ్డుకుని కొత్తగనులు ఏర్పాటు, కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు, ఉద్యోగ భద్రత వంటి వాగ్దానాలు ఇచ్చి గెలిచిన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ సంఘాలు, నాయకులు సీతారామయ్య, జనక్‌ప్రసాద్‌లు కార్మిక వర్గాన్ని మోసం చేస్తూ అవినీతి వాటాలతో తోడుదొంగలుగా మారారని విమర్శించారు. డిమాండ్‌ల సాధనలో సింగరేణి కార్మికవర్గం, కాంట్రాక్ట్ కార్మికులు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.