
రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య
తాంసి: మద్యం మత్తులో రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పొన్నారిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన గుమ్ముల నరేశ్ (31) కూలీ పనులకు వెళ్తూ కుటుంబానికి అండగా ఉండేవాడు. ఈక్రమంలో కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ పోషణకు గ్రామంలో పలువురి వద్ద అప్పులు సైతం చేశాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున గ్రామ శివారులో గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ టి.ప్రభాకర్ మృతదేహన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రైల్వే స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టెబుల్ తెలిపారు.
జీవితంపై విరక్తితో ఒకరు..
భైంసారూరల్: జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై శంకర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని కుంబి గ్రామానికి చెందిన ఉప్పులవార్ మాధవరావు (49) గ్రామంలో గొర్రెల కాపరిగా పనిచూస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఉరేసుకుని ఒకరు..
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని ఓ లాడ్జిలో ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన నరేందర్(40)కు పదిహేనేళ్ల క్రితం వాంకిడి మండలానికి చెందిన సంతోషితో వివాహమైంది. ఏడాదిక్రితం అతని భార్య అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఒంటరి జీవితాన్ని గడుపుతూ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మానసికంగా బాధపడుతూ ఊర్లు తిరుగుతుండేవాడు. ఈక్రమంలో కాగజ్‌నగర్‌కు వచ్చి లాడ్జిలో బస చేశాడు. మంగళవారం గదిలో ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకున్నాడు. మృతుని సోదరుడు భూంపల్లి ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని జీఎస్ ఎస్టేట్‌లో నివాసముంటున్న ఆనంద్ త్రిపాఠి ఇంట్లో చోరీ జరిగింది. బాధితుడు ఈ నెల 6న ఇంటికి తాళం వేసి మధ్యప్రదేశ్‌కు వెళ్లాడు. సోమవారం సాయంత్రం అతని స్నేహితుడు శివకుమార్ ఇంటి ముందు నుంచి వెళ్తుండగా కిటికి తలుపులు తెరిచి ఉండడం గమనించాడు. లోపలికి వెళ్లిచూడగా తాళం పగులగొట్టి ఉండడంతో విషయాన్ని స్నేహితుడికి సమాచారం అందించాడు. లాకర్‌లో ఉన్న రూ.10వేల నగదు, రిస్ట్ వాచ్, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు పేర్కొన్నాడు. శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు.
జఠాశంకర ఆలయంలో..
ముధోల్: మండల కేంద్రంలోని జఠాశంకర ఆలయంలో మంగళవారం చోరీ జరిగినట్లు ఎస్సై బిట్ల పెర్సిస్ తెలిపారు. మధ్యాహ్నం సమయంలో గుర్తుతెలియని దొంగ ఆలయంలో ఉన్న హుండీ పగులగొట్టి డబ్బులు ఎత్తుకెళ్ళాడు. ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై ఆలయానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ పుటేజీల ఆధారంగా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్సై తెలిపారు.