
ఎన్‌ఆర్‌ఐ కృష్ణపై కేసు నమోదు
ఇంద్రవెల్లి: రిమ్స్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసగించిన మండలంలోని శంకర్‌గూడకు చెందిన ఎన్‌ఆర్‌ఐ, డిజిటల్ మైక్రో ఫైనాన్స్ చైర్మన్ జవాడే కృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండల కేంద్రానికి చెందిన డిగ్రీ విద్యార్థి తుంగపిండి ఉదయ్‌కుమార్‌కు కృష్ణతో పరిచయం ఏర్పడింది. మే నెలలో వారింటికి వెళ్లి రిమ్స్‌లో ఏఎన్‌ఎం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, మీ అమ్మకి ఇప్పిస్తానని చెప్పడంతో జూన్ 3న ఉదయ్‌కుమార్ తన తల్లితో కలిసి ఆదిలాబాద్‌లోని రామ్‌నగర్‌లో ఉన్న డిజిటల్ మైక్రో ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్లి రూ.2.30 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాత ఉద్యోగం కోసం పలుమార్లు కార్యాలయానికి వెళ్లగా అక్కడ కృష్ణ కనిపించలేదు. దీంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు మంగళవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎసై తెలిపారు.
వినాయక మండపం కూల్చివేత
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 21 వార్డు బూడిదగడ్డ బస్తీలో నిర్మిస్తున్న వినాయక మండపాన్ని మంగళవారం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తహసీల్దార్ కృష్ణ , వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో శ్రీనివాసరావు పరిశీలించి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అనుమతి లేకుండా మండపం నిర్మించడం సరికాదని నిర్వాహకులకు సూచించారు.
కడెం ప్రాజెక్ట్ రెండు గేట్లు ఎత్తివేత
కడెం: ఎగువన కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్ట్‌కు మంగళవారం రాత్రి 4,812 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరడంతో ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు రెండు వరద గేట్లను ఎత్తి 12,833 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 696.775 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది.
యూరియా కోసం రైతుల వెతలు
తాండూర్: ఖరీఫ్ సీజన్‌లో వివిధ రకాల పంటలు సాగుచేసిన మండల రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటల సాగు అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా కాకపోవడంతో నానా తంటాలు పడుతున్నారు. మండల సహకార సంఘానికి ప్రస్తుతం 12 టన్నుల (260 బస్తాలు) యూరియా మాత్రమే సరఫరా అయ్యింది. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున ఇస్తుండడంతో అన్నదాతలు గంటల తరబడి క్యూలో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇంద్రవెల్లి: మండల కేంద్రంలోని పీఏసీఎస్, హక రైతు సేవ కేంద్రం, ఫర్టిలైజర్ దుకాణాల్లో గత 10 రోజులుగా యూరియా కొరత ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనులు మానేసి దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. కొన్నిషాపుల్లో యూరియా ఉన్న అవసరంలేని మందులతో లింకులుపెట్టి వాటిని అంటగడుతూ ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించి యూరియా కొరతలేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.