
భారీ వాహనాల రాకపోకలపై నిషేధం ఎత్తివేత
జన్నారం: జన్నారం గుండా పగటిపూట భారీ వాహనాల రాకపోకల నిషేధం ఎత్తివేస్తున్నట్లు వైల్డ్‌లైఫ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి ఏలుసింగ్ ఆదేశాలు జారీ చేసినట్లు మంచిర్యాల జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్ తెలిపారు. సోమవారం సాయంత్రం మండల కేంద్రంలోని ఎఫ్‌డీవో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జన్నారం మీదుగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు భారీ వాహనాలు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా గతంలో మాదిరి భారీ వాహనాలకు రూ.150 పర్యావరణ శిస్తు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వాహనాల అనుమతి తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో రేంజ్ అధికారులు సుష్మారావు, శ్రీధరచారి, దయాకర్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.