కేరళలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. తన తప్పు లేకపోయినా ఓ మహిళ తనను తీవ్రంగా అవమానించిందనే బాధతో ఓ యువకుడు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తనను దూషిస్తూ వీడియో చేసి సామాజిక మాద్యమాలలో పోస్ట్ చేసి తన పరువు తీసిందనే మనస్థాపంతో తనువు చాలించాడు.
గోవిందపురంకు చెందిన దీపక్ అనే యువకుడు కోజికోడ్‌లో ఓ వస్త్రాల దుకాణంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తన వ్యక్తిగత పనిమీద కన్నూర్ వెళ్లడానికి బస్సుఎక్కాడు. ఆసమయంలో బస్సులో ఉన్న ఓయువతి తనను దీపక్ అసభ్యంగా తాకాడని ఆరోపిస్తూ వీడియో చేసింది. అది కాస్త ఇన్‌స్టాలో వైరలయ్యింది.దీంతో దీపక్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
అనంతరం తీవ్ర అవమాన భారంతో ఆదివారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందులో తన తప్పేం లేదని శనివారం తన స్నేహితులతోనూ మాట్లాడినట్లు వారు పేర్కొన్నారు. దీపక్ చాలా మంచి వాడని అతని స్నేహితులు తెలిపారు. ఏడు సంవత్సరాలుగా తన వద్ద పనిచేస్తున్నాడని ఇప్పటివరకూ అతని గురించి ఒక్క చెడుమాట కూడా వినలేదని అతని పనిచేస్తున్న షాపు యజమాని పేర్కొన్నారు.
అయితే ఈ ఘటన గురించి ఆ మహిళను సంప్రదించారు. బస్సులో తనతో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు తన ఉద్దేశం ఏంటని ప్రశ్నించానని ఆమె తెలిపింది. వీడియో చిత్రీకరించిన సమయంలోనే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడుతుందని తెలిపానని అయితే అతను ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని ఆమహిళ పేర్కొంది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై మరింత లోతైన విచారణ చేయనున్నట్లు తెలిపారు.


