
న్యూఢిల్లీ: కొందరు క్షణికావేశానికి లోనై నిండు జీవితాన్ని మధ్యలోనే అంతం చేసుకుంటుంటారు. ఆ క్షణంలో వారు సరైన నిర్ణయం తీసుకుంటే జీవితాన్ని బంగారుమయం చేసుకోగలుగుతారు. ఢిల్లీకి చెందిన ఒక యువ చార్టర్డ్ అకౌంటెంట్ హీలియం గ్యాస్ పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ధీరజ్ కన్సల్ అనే 25 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ ఢిల్లీలోని ఒక గెస్ట్ హౌస్‌లో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ధీరజ్ ఫేస్‌బుక్‌లో తన సూసైడ్ నోట్‌ను పోస్ట్ చేశాడు. దానినే రాత పూర్వకంగానూ తన గదిలో ఉంచాడు. హీలియం గ్యాస్ పీల్చడంద్వారా ఢిల్లీలో నమోదైన తొలి ఆత్మహత్య కేసుగా ఇది నిలిచింది. ధీరజ్ గోల్ మార్కెట్‌లోని ఒక గెస్ట్ హౌస్‌లో బసచేస్తున్నాడు. అతను గది నుంచి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో గెస్ట్ హౌస్ యజమానికి అనుమానం వచ్చింది.
దీంతో అతను పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు తలుపు పగలగొట్టి చూడగా, ధీరజ్ మంచం మీద అచేతనంగా కనిపించాడు. అతని నోటికి హీలియం సిలిండర్‌ను అనుసంధానం చేసిన పైపు ఉంది. అలాగే అతని ముఖం పారదర్శక ప్లాస్టిక్ షీట్‌తో కప్పి ఉంది. జూలై 20న గెస్ట్ హౌస్‌లో చెక్ ఇన్ చేసిన ధీరజ్ జూలై 28న చెక్ అవుట్ చేయాల్సి ఉంది. ధీరజ్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో..‘నా మరణానికి ఎవరినీ నిందించవద్దు. ఇది నేను తీసుకున్న నిర్ణయం. నా జీవితంలో నేను కలిసిన ప్రతి ఒక్కరూ నాతో ఎంతో ప్రేమగా మెలిగారు.
అందుకే ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని పోలీసులను అభ్యర్థిస్తున్నాను. నా డబ్బును అనాథాశ్రమానికి లేదా వృద్ధాశ్రమానికి విరాళంగా ఇవ్వండి. నా అవయవాలను దానం చేయండి. ఎవరూ ఇబ్బందుల్లో పడకూడదనే నేను ఎవరి పేర్లను ప్రస్తావించడం లేదు’ అని ధీరజ్ సూసైడ్ నోట్‌లో రాశాడు. ఘజియాబాద్‌లోని ఒక ఈ-కామర్స్ వెబ్‌సైట్ నుండి ధీరజ్ హీలియం సిలిండర్‌ను ఆర్డర్ చేశాడని పోలీసులు గుర్తించారు. ధీరజ్ 2002లో తన తండ్రిని కోల్పోయాడు. అనంతరం తల్లి తిరిగి వివాహం చేసుకుంది. దీంతో అప్పటి నుంచి ధీరజ్ తన తాత ఇంటిలో పెరిగాడు.