యమునా నది వివాదం.. ఎప్పుడేం జరిగింది? | Yamuna River Row: 30-year timeline of Delhi vs Haryana feud | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ఎన్నికల్లో హీట్‌.. అసలేంటి ‘యమున’ వివాదం?

Jan 30 2025 5:46 PM | Updated on Jan 30 2025 7:08 PM

Yamuna River Row: 30-year timeline of Delhi vs Haryana feud

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేప‌థ్యంలో యమునా నదిపై రాజ‌కీయ వివాదం చెల‌రేగింది. ఢిల్లీ జీవ‌నాడిగా భావించే యమునా నదిపై రాజ‌కీయ పార్టీలు వాదోప‌వాదాల‌కు దిగాయి. యమునా నది (Yamuna River) కాలుష్యానికి మీరు కార‌ణ‌మంటే.. మీరు కార‌ణ‌మ‌ని అధికార, విప‌క్షాలు వాదులాడుకుంటున్నాయి. యమునా నది కాలుష్యంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై రాజ‌కీయ దుమారం (Political Heat) రేగింది. న్యాయ‌ప‌రంగానూ ఆయ‌న‌కు చిక్కులు ఎదుర‌య్యాయి.

య‌మునా న‌దిని హ‌రియాణాలోని బీజేపీ ప్ర‌భుత్వం విష‌తుల్యం చేస్తోంద‌ని బుధ‌వారం ఢిల్లీలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో కేజ్రీవాల్ తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ర‌చ్చ మొద‌లైంది. కేజ్రీవాల్ ఆరోప‌ణ‌ల‌ను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (Narendra Modi) తిప్పికొట్టారు. మ‌రోవైపు కేజ్రీవాల్‌కు హ‌రియాణా కోర్టు, ఎన్నిక‌ల సంఘం తాఖీదులు పంపాయి. యమునా నది కాలుష్యంపై చేసిన ఆరోప‌ణ‌ల‌కు ఆధారాలు చూపించాల‌ని ఆదేశించాయి. కేజ్రీవాల్ కూడా ఏమాత్రం వెన‌క్కు త‌గ్గ‌కుండా దీటుగా స్పందించ‌డంతో వివాదం మరింత ముదిరింది.

హస్తిన జీవనాడి
దేశరాజధాని ఢిల్లీకి యమునా నది జీవనాడి వంటిది. హస్తిన జనాభాలో 70 శాతం మందికి నీటిని అందించే ఈ నది ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగివుంది. అయితే దేశంలోని ఇతర ప్రధాన నదుల మాదిరిగానే యమున కూడా కాలుష్యకాసారంగా మారిపోయింది. పట్టణీకరణ బాగా పెరగడం.. మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలను నిరంతరం నదిలోకి వదులుతుండడంతో యమున కాలుష్యం బారిన పడింది. యమున నదిపై ఢిల్లీ, హరియాణా రాష్ట్రాల మధ్య ఎన్నో ఎళ్లుగా తగాదాలు నడుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాజాగా మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది.

యమునా నది జలాల పంపిణీ వివాదం ఇలా...
1993లో ఢిల్లీ శాసనసభ ఏర్పడింది. యమునా నదీ జలాల పంపిణీపై 1994, మే నెలలో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీనిపై ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకాలు చేశారు. అయితే ఈ వ్యవహారం 1995, మార్చి 31న సుప్రీంకోర్టుకు చేరింది. ఢిల్లీలో తాగునీటి కొరతను తగ్గించేందుకు యమునా నదిలో నీటి ప్రవాహాన్ని సక్రమంగా నిర్వహించేలా హరియాణాకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర తీర్పు వెలువరించింది. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ఢిల్లీకి వెంటనే నీరు విడుదల చేయాలని ఆదేశించింది. 5 రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం నడుచుకోవాలని సూచించింది. 1996, ఫిబ్రవరిలోనూ మరోసారి ఇలాంటి ఆదేశాలిచ్చింది. వజీరాబాద్, హైదర్‌పూర్‌లోని రెండు నీటి రిజర్వాయర్‌లు, ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ల నుంచి ఢిల్లీకి నీరు ఇవ్వాలని పేర్కొంది.

2018, ఏప్రిల్ నెలలో వజీరాబాద్ రిజర్వాయర్‌లో నీటిమట్టం పడిపోవడంతో అప్పటి ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపుతట్టింది. సమస్యను పరిష్కరించాలని ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ వివాదానికి సంబంధించి కోర్టులు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)లో ఉన్న అన్ని కేసులను ఉపసంహరించుకుంటేనే నీటిని విడుదల హరియాణాలోని అప్పటి మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తామని హామీ ఇచ్చింది.

2021, మార్చిలో మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. హరియాణాకు వ్యతిరేకంగా ఢిల్లీ జల్‌ బోర్డు(DJB) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. యమునా నీటి పంపిణీపై 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హరియాణా ప్రభుత్వం ధిక్కరించిందని కోర్టుకు తెలిపింది. దీనిపై హరియాణా ప్రభుత్వం సర్కారు స్పందిస్తూ.. తమ తప్పు ఏమీలేదని, హస్తిన సర్కారు అసమర్థత కారణంగానే నీటి ఎద్దడి సమస్య ఉత్పన్నమైందని వాదించింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వ పిటిషన్‌ను 2021, జూలైలో సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

చ‌ద‌వండి: హరియాణాలో ఉన్నది మనుషులు కాదా?

2023, జూలైలో దేశ రాజధాని​కి వరదలు పోలెత్తాయి. ఈ సమయంలో యమునానగర్ జిల్లాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి ఉద్దేశపూర్వకంగా హరియాణా నీటిని విడుదల చేసిందని ఆప్‌ ప్రభుత్వం ఆరోపించింది. కాగా, యమునా జలాల్లో తన వాటాను విడుదల చేయకుండా ఢిల్లీకి వ్యతిరేకంగా హరియాణా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ 2024, జూన్‌ నెలలో అప్పటి ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి, ప్రస్తుత సీఎం అతిషి నిరాహార దీక్ష చేశారు. తాజాగా కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలతో యమున నదీ వివాదం ఢిల్లీ ఎన్నికల్లో తెరమీదకు వచ్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement