ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయానికి ర్యాలీ చేపట్టిన మహిళా సంఘాలు
న్యూఢిల్లీ: ఓట్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ఆందోళనల వేళ దేశవ్యాప్తంగా ఉద్యమించిన మహిళలపై పలు చోట్ల పోలీసులు జరిపిన లైంగిక వేధింపులు, అనుచిత ఘటనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ శనివారం దేశ రాజధానిలో మహిళా, విద్యార్థి సంఘాలు నిరసనబాటపట్టాయి. మహిళా ఉద్యమకారులతో అసభ్యకరంగా ప్రవర్తించిన, అనుచితంగా తాగి వేధించిన పోలీసులపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్చేస్తూ మహిళా, విద్యార్థి సంఘాలు ఢిల్లీ గురుద్వారా బంగ్లా సాహిబ్ నుంచి పోలీస్ ప్రధాన కార్యాలయానికి ర్యాలీ ఆరంభించాయి.
ఆలిండియా డెమొక్రటిక్ ఉమెన్ అసోసియేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్, ఆలిండియా ప్రోగ్రెసివ్ ఉమెన్ అసోసియేషన్, ఆలిండియా మహిళా సాంస్కృతిక్ సంఘటన్, కలెక్టివ్, ఆలిండియా ఫెమినిస్ట్ అలయన్స్, ప్రగతిశీల మహిళా సంఘటన్, పురోగామి మహిళా సంఘటన్ తదితర మహిళా సంఘాలతోపాటు విద్యార్థి సంఘాల సభ్యులు ఈ ర్యాలీలో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ‘మమ్మల్ని భయపెట్టగలరేమో మౌనంగా ఉంచలేరు’, ‘దోపిడీ, అణచివేతల నుంచి విముక్తి’, ‘పోలీసుల జులుం నశించాలి’, ‘లింగవివక్ష అంతంకావాలి’ అనే నినాదాలతో ర్యాలీ మార్మోగిపోయింది.
జూలై 20న మొదలైన ఎస్ఐఆర్ ఉపసంహరణ, సీఈసీ జ్ఞానేశ్ రాజీనామా డిమాండ్ ఉద్యమాల్లో పాల్గొన్న మహిళలు, విద్యార్థినులతో పోలీసుల అనుచిత ప్రవర్తన తాలూకు వీడియోలు, ఫొటోలు, బాధితుల వాంగ్మూలాల తాలుకు వివరాలను పోలీస్ ఉన్నతాధికారులకు అందజేసేందుకు బయల్దేరగా మార్గమధ్యంలోనే బారీకేడ్లతో అడ్డుకున్నారు. దీంతో మహిళా సంఘాల నేతలు, స్త్రీవాదులు అదనపు డెప్యూటీ కమిషనర్ జగ్దేవ్ను కలిసి తమ నిరసన తెలిపారు.
రోడ్లపై ఉద్యమిస్తున్న మహిళలను నిర్బంధంలోకి తీసుకుంటూ బస్సులో అసభ్యకరంగా తాకారని, నిర్బంధ కేంద్రాల్లోనూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదుచేశారు. అసిస్టెంట్ కమిషనర్ ర్యాంక్ పోలీస్ అధికారి తనను అత్యంత అసభ్యకరంగా తాకాడని యువ మహిళా పాత్రికేయురాలు ఆరోపించారు. ఈ విషయమై ఘటన జరిగినప్పుడే ఫిర్యాదుచేయబోతే అరెస్ట్చేసి ఆమె మీద తిరిగి పోలీస్లు కేసు పెట్టారని మహిళా నేతలు వివరించారు. ‘‘మహిళలు ఉద్యమపంథా నుంచి, రాజకీయాల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకోవాలనే ఉద్దేశంతో పోలీసులు మాపై దారుణాలకు పాల్పడుతున్నారు. మా గొంతు విన్పించకుండా చేస్తున్నారు’’అని అన్నారు.


