ఇవి ఎన్నికలు కావు.. పక్కా ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ | Sajjala Ramakrishna Reddy expresses fires on Chandrababu government | Sakshi
Sakshi News home page

ఇవి ఎన్నికలు కావు.. పక్కా ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌

Oct 18 2026 3:37 AM | Updated on Oct 18 2026 3:37 AM

Sajjala Ramakrishna Reddy expresses fires on Chandrababu government

రాష్ట్రంలో కిరాయి సైన్యంగామారిన పోలీసులు 

పూర్తి నిష్క్రియాపరంగా రాష్ట్ర ఎన్నికల సంఘం 

చంద్రబాబు ప్రభుత్వంపైసజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం 

‘స్థానిక’ గెలుపుపై ధీమా లేకే సర్కార్‌ అరాచకాలకు తెరలేపిందని విమర్శ 

సాక్షి,అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ తీవ్ర అధికార దుర్వినియోగానికి, రాక్షస పాలనకు నిదర్శనంగా మారిందని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్నది స్థానిక సంస్థల ఎన్నికలు ఎంతమాత్రం కాదని, ముందస్తు ప్రణాళికతో చంద్రబాబు నడిపిస్తున్న ఒక ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అని ఆయన విమర్శించారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. 

44 లక్షల దొంగ ఓట్లతో ఎన్నికల డ్రామా  
‘15 లక్షల మంది మృతుల ఓట్లతో పాటు మరో 29 లక్షల బోగస్, డూప్లికేట్‌ ఓట్లు.. ఇలా మొత్తం 44 లక్షల అనుమానాస్పద ఓట్లు జాబితాలో ఉన్నాయి. త్వరలో సర్‌ ప్రక్రియ ముగుస్తున్న తరుణంలో ఇంత హడావుడిగా లేని ఓట్లతో ఎన్నికలు జరపాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకొచ్చింది? కేవలం 12 రోజు­ల్లోనే మొత్తం తంతు ముగించేలా కుట్ర పన్నారు. చిట్టచివరి నిమిషంలో రిజర్వేషన్లు ప్రకటించి ఎవరూ సిద్ధం కాకుండా చేశారు. అధికారంలో ఉన్న అడ్వాంటేజ్‌తో ప్రతిపక్షానికి అసలు అవకాశమే లేకుండా షెడ్యూల్‌ ఖరారు చేసుకున్నారు.

ప్రతిపక్ష అభ్యర్థులు కనీసం నామినేషన్లు కూడా వేయకుండా పోలీసుల అండతో ప్రభుత్వం భౌతిక దాడులకు తెగబడుతోంది. రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో పోలీసు వ్యవస్థను ఒక మాఫియాలా మార్చే­శారు.  ఎన్నికల సంఘం పూర్తిగా డమ్మీగా మారిపోయింది.  మేము వెళ్లి ఎస్‌ఈసీకి ఆధారా­లతో సహా ఫిర్యాదు చేస్తే వారు దాన్ని డీజీపీకి పంపిస్తున్నారు. డీజీపీ వాటిని బుట్టదాఖలు చేస్తు­న్నారు. చట్టాన్ని అతిక్రమించి కిరాయి సైనికుల్లా వ్యవహరిస్తున్న ప్రతి అధికారి పేరునూ  రాసిపెట్టుకుంటున్నాం. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 

నామినేషన్ల పర్వంలోనే అక్రమాలకు కుట్ర  
దేశంలో ఎక్కడా లేనివిధంగా నామినేషన్లకు రోజు­కు కేవలం నాలుగు గంటలు (ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు) మాత్రమే సమ­యం ఇచ్చారు. ఆ నాలుగు గంటల్లో కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వస్తే భౌతికంగా అడ్డుకుంటున్నారు. నామినేషన్‌ కేంద్రాలను ప్రధాన కార్యాలయాల్లో కాకుండా, సీసీ కెమెరాలు కూడా లేని సందుగొందుల్లోని చిన్న పాఠ­శాలల్లో పెట్టారు. అక్కడ టీడీపీ గూండాలు వందల సంఖ్యలో తిష్టవేసి ఉంటే పోలీసులు వారికి రక్షణగా నిలుస్తున్నారు. 

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పత్రాలు పట్టుకుని వెళ్తే పోలీసులే బలవంతంగా బయటకు నెట్టేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి, తమ పాల­న­పై ధైర్యం ఉంటే ప్రతిపక్ష అభ్యర్థులను స్వేచ్ఛగా నామినేషన్లు వేయనిచ్చి, ఎన్నికల బరిలో ప్రజా తీర్పును ఆహ్వానించాలని సజ్జల డిమాండ్‌ చేశారు. గెలుపు ధీమా లేకే సర్కార్‌ అరాచకాలకు తెరలేపిందని విమర్శించారు. అధికార పార్టీ ఎన్ని దాడులు చేసినా, తప్పుడు కేసులు పెట్టినా వైఎస్సార్‌సీపీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement