టీడీపీలో టికెట్ల చిచ్చు.. భగ్గుమంటున్న తమ్ముళ్లు
గడువు ముంచుకొస్తున్నా తేలని మేయర్, చైర్మన్ అభ్యర్థులు
నెల్లూరులో మంత్రి, ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. అనంతలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
జెండా మోసినోళ్లకు మొండిచేయి.. వలసొచ్చినోళ్లకు పీఠాలు
పార్టీ శ్రేణుల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహజ్వాలలు
సీనియర్ల రాజీనామాలు, వలసలు, వేధిస్తున్న రెబెల్స్ బెడద
సాక్షి, అమరావతి: ఒకవైపు నామినేషన్ కేంద్రాల దగ్గర ప్రతిపక్షంపై దౌర్జన్యాలకు తెగబడుతున్న అధికార టీడీపీ.. మరోవైపు సొంత ఇంట్లోనే కుమ్ములాటలతో సతమతమవుతోంది. మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపకం ఆ పార్టీలో చిచ్చు రేపుతోంది. ఏళ్లుగా జెండా మోసిన కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోతుంటే, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు రోడ్డున పడుతోంది. సీనియర్లు మౌనవ్రతం పాటిస్తుంటే మరికొందరు రెబల్స్‌గా బరిలోకి దిగుతున్నారు. ఇంకొందరు ఏకంగా పార్టీనే వీడుతున్నారు.
గడువు ముంచుకొస్తున్నా తేలని పంచాయితీ
నామినేషన్ల గడువు ఆదివారం మధ్యాహ్నంతో ముగుస్తోంది. అయినా అధికార పార్టీ ఇప్పటికీ తన అభ్యర్థులను పూర్తిగా ఖరారు చేసుకోలేకపోయింది. పొత్తులో టీడీపీకి 11 కార్పొరేషన్లు దక్కితే ఇప్పటివరకూ 10 స్థానాలకు మేయర్ అభ్యర్థులను ప్రకటించింది. 78 మున్సిపాలిటీలకు 60 చోట్లే చైర్మన్ అభ్యర్థులను తేల్చింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితే నామినేషన్లు మొదలైన రోజు వరకూ కూటమి ఒక్కచోట కూడా చైర్మన్ అభ్యర్థిని ఖరారు చేయలేకపోయింది. పార్టీలో సీనియర్లు ఒకవైపు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలు మరోవైపు పీఠాల కోసం పట్టుబడుతున్నారు. ఎవరికి ఇచ్చినా మరో వర్గం భగ్గుమంటుందన్న భయం అధిష్ఠానాన్ని వెంటాడుతోంది.
నెల్లూరులో ముగ్గురు నేతల మధ్య యుద్ధం
నెల్లూరు మేయర్ అభ్యర్థి ఎంపిక టీడీపీలో ఆధిపత్య పోరుకు వేదికైంది. మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఒకవైపు, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మరోవైపు తమ వారిని కూర్చోబెట్టేందుకు పంతానికి పోయారు. తెరవెనుక మంత్రాంగాలు సాగాయి. చివరకు నారాయణ, వేమిరెడ్డి ద్వయం పైచేయి సాధించగా, కోటంరెడ్డి పంతం పటాపంచలైంది. సమన్వయం కుదరక కూటమి పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కూటమి నుంచి ఒకే డివిజన్లో ఇద్దరు, ముగ్గురు బరిలో ఉండే అవకాశం కనిపిస్తోంది.
వర్గపోరుతో సొంత కార్పొరేషన్నే వదిలేశారు
అనంతపురంలో టీడీపీ పరిస్థితి మరీ విచిత్రం. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ ఇద్దరిలో ఎవరి వర్గానికి మేయర్ సీటు ఇచ్చినా మరో వర్గం సహకరించే పరిస్థితి లేదని అధిష్ఠానానికే ఫిర్యాదులు వెళ్లాయి. సొంత నేతలను ఏకతాటిపైకి తేలేక, చివరకు అనంతపురం కార్పొరేషన్‌ను మిత్రపక్షానికే వదిలేయాల్సి వచ్చిందన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జోరుగా సాగుతోంది.
తిరువూరులో ఎమ్మెల్యే తిరుగుబాటు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరును జనసేనకు కేటాయించగా అక్కడ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరుగుబాటు చేస్తున్నారు. ఆదివారం మున్సిపల్ ఛైర్మన్ పదవికి తమ అభ్యర్థితో నామినేషన్ వేయిస్తానని ప్రకటించారు. విజయవాడ, ఏలూరు కార్పొరేషన్లు జనసేనకు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. దీంతో ఎన్నికల్లో అందరూ ఏకతాటిపై నిలుస్తారన్న నమ్మకం ఆ పార్టీ పెద్దల్లోనే నానాటికీ సన్నగిల్లిపోతోంది.


