మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి
పోలీసుల తీరుపై కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఆగ్రహం
నామినేషన్ కేంద్రం వద్దే ఉన్న టీడీపీ మూకలను పట్టించుకోరా?
100 మీటర్ల దూరంలో ఉన్న మాపై లాఠీచార్జ్ చేస్తారా?
ఒక్క చోట అయినా గెలుస్తామన్న నమ్మకం లేకే ఈ దౌర్జన్యాలు
ఎన్నికల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకోవాలి
సాక్షి ప్రతినిధి, కడప/పులివెందుల: ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకుంటే ఇక ఎన్నికలు ఎందుకు జరిపించడం ఎందుకని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పులివెందులలో నామినేషన్లు వేసేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు, పార్టీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి.. టియర్ గ్యాస్ ప్రయోగించడం దారుణం అని మండిపడ్డారు. పోలీసుల తీరుకు నిరసనగా ఎంపీ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెళ్తే లాఠీ దెబ్బలు, రాళ్ల దాడులు ఎదుర్కోవాలా?
ఎన్నికల సంఘం అసలు ఉన్నట్టా, లేనట్టా? ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం ఎందుకు? డీఐజీ, ఎస్పీ, డీఎస్పీలను సంప్రదిస్తే మధ్యాహ్నం 1.30 గంటలకు రండి.. మీ అభ్యర్థులందరితో నామినేషన్లు వేయిస్తాం.. ఎలాంటి ఇబ్బందీ ఉండదని చెప్పారు. వాళ్లు చెప్పిన మాటను నమ్మి మా అభ్యర్థులతో వస్తే, ఈ రోజు వద్దు.. రేపు (ఆదివారం) రండి అంటున్నారు. ఈ రోజు మాకు నామినేషన్లు వేసే హక్కు ఎందుకు లేదు? పోలీసులే హామీ ఇచ్చి, మళ్లీ మాట తప్పడం ఏంటి? ఇదెక్కడి న్యాయం?’ అని నిలదీశారు.
తుపాకులు గురిపెట్టడం ఏమిటి?
‘మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ కార్యకర్తలు ఉంటే పోలీసులు వారి జోలికి వెళ్లరు. మేము 100 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. డీఎస్పీ ఏకే–47 తుపాకీ గురిపెట్టి మా మీదకు వస్తారు. టీడీపీ శ్రేణుల వద్ద వేట కొడవళ్లు, కత్తులు, కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లు ఉన్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? నామినేషన్లు వేయడానికి వచ్చిన మా అభ్యర్థుల పత్రాలను లాక్కొని చించేశారు. రిటర్నింగ్ అధికారికి ఇచ్చిన తర్వాత కూడా పత్రాలను తీసుకెళ్లారు. అధికారులు, పోలీసులు తమ బాధ్యతలను నిర్వహిస్తున్నారా? లేక అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారా?
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత పోలీసులపై లేదా? రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉన్నట్టా, లేనట్టా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే ఒక్క మున్సిపాలిటీలోనైనా, ఒక్క కౌన్సిలర్ స్థానంలోనైనా గెలుస్తామనే నమ్మకం కూటమి ప్రభుత్వానికి లేదనే విధంగా పరిణామాలు కనిపిస్తున్నాయి. పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నాలను ఆపాలి. ఎన్నికల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకుని, నామినేషన్లు వేసే ప్రతి అభ్యర్థికి రక్షణ కల్పించాలి’ అని అవినాశ్రెడ్డి డిమాండ్ చేశారు.


