ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి | Presidents rule should be imposed in AP says YS Jagan | Sakshi
Sakshi News home page

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి

Oct 18 2026 2:51 AM | Updated on Oct 18 2026 2:51 AM

Presidents rule should be imposed in AP says YS Jagan

కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి 

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ 

కుప్పకూలిన రాజ్యాంగం.. పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ 

పార్టీ మూకలకు గూండా లైసెన్స్‌లు ఇచ్చిన చంద్రబాబు 

నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం ఎన్నికలా? 

ప్రతిపక్ష అభ్యర్థులను ఎత్తుకెళ్లడం ప్రజాస్వామ్యమా? 

ఎంపీలపైనే దాడులు చేయించడం రాజ్యాంగ పాలనా? 

రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ నడిపిస్తున్న చంద్రబాబు  

సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం కుప్పకూలిపోయింది... ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ‘సేవ్‌ డెమొక్రసీ ఇన్‌ ఏపీ’ హ్యాష్‌ ట్యాగ్‌తో శనివారం పోస్టు చేశారు. 

స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వరుసగా రెండో రోజూ సీఎం చంద్రబాబు శాంతిభద్రతలను పూర్తిగా నిర్వీర్యం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పార్టీ మూకలకు గూండా లైసెన్స్‌లు ఇచ్చి, వారికి అండగా పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్నారంటూ మండిపడ్డారు. రాజకీయ హింసావాదిగా తన చరిత్రను మరోసారి చాటుకుంటూ రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ను నడిపిస్తున్నారని సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయలేని దుస్థితి... 
‘‘ప్రతిపక్ష అభ్యర్థులు కనీసం నామినేషన్లు కూడా వేయలేని దుస్థితి సృష్టించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పోలీ­సుల సమక్షంలోనే, నామినేషన్‌ కేంద్రాల పరిధిలోనే,  కత్తులు, కర్రలతో వెంటాడటం, నామినేషన్‌ కేంద్రాలను ముట్టడించడం, ఆర్వో కార్యాలయాల్లోకే చొరబడి నామినేషన్‌ పత్రాలను లాక్కుని చించేయడం, అర్ధరాత్రి అభ్యర్థులను పోలీసులు ఎత్తుకెళ్లడం.. ఇదీ చంద్రబాబు మార్కు ప్రజాస్వామ్యం. ఎన్నికలను ఏకపక్షంగా మార్చేందుకు అధికార బలంతో హింసను ప్రేరేపిస్తున్నారు. దారుణమేమిటంటే, అభ్యర్థులకు ప్రపోజర్లుగా వెళ్లిన మా పార్టీ ఎంపీలను కూడా వదల్లేదు. వారి చేతుల్లోంచి నామినేషన్‌ పత్రాలను లాక్కుని చించేశారు. ముగ్గురు ఎంపీలపై పోలీసుల సమక్షంలోనే, పోలీసుల ద్వారానే దాడులు జరిగాయి. ఎంపీలకే రక్షణ లేని రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి?

పులివెందులలో పోలీసుల కాల్పులు ప్రజాస్వామ్యంపై పేల్చిన తూటాలే..
కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి, పుంగనూరు, తిరుపతి, దర్శి, దాచేపల్లి, గురజాల సహా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలు చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా దిగజారిపోయిందో కళ్లకు కట్టినట్లు  కనిపిస్తోంది. పులివెందులలో పోలీసుల కాల్పులు ప్రజాస్వామ్యంపై పేల్చిన తూటాలే. దీని వెనుక ముమ్మాటికీ చంద్రబాబుగారి కుట్రే! నామినేషన్‌ వేయడానికి వచ్చిన అభ్యర్థులపై, ప్రపోజెర్స్‌ పై పోలీసులు దాడి చేసి ఎందుకు కొట్టారు! ఎందుకు  కాల్పులు జరిపారు. 

చంద్రబాబూ..  నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం ఎన్నికలా? ప్రతిపక్ష అభ్యర్థులను పోలీసులతో ఎత్తుకెళ్లడం ప్రజాస్వామ్యమా? ఎంపీలపైనే దాడులు చేయించడం రాజ్యాంగ పాలనా? రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేస్తున్నాను. సూపర్‌  6, సూపర్‌ 7ల మోసాలతో ప్రజలకు బాండ్లు ఇచ్చి మరీ మోసం చేసిన ఈ వెన్నుపోటు పార్టీ నుంచి ఇంతకన్నా ఏమి ఆశించగలం’’.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement