వైఎస్సార్‌సీపీ అభ్యర్ధిగా రేష్మ నామినేషన్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ అభ్యర్ధిగా రేష్మ నామినేషన్‌

Oct 18 2026 2:18 AM | Updated on Oct 18 2026 2:18 AM

రాజంపేట : వైఎస్సార్‌సీపీ అభ్యర్ధిగా నడిగడ్డ రేష్మా నామినేషన్‌ శనివారం దాఖలు చేశారు. మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ పోలా శ్రీనువాసులరెడ్డి, తన తండ్రి ఇమామ్‌తో కలిసి వచ్చి నామినేషన్‌ అధికారులకు అందచేశారు.

నామినేషన్‌ పత్రాల

చించివేతపై కేసు నమోదు

మైదుకూరు : మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను చించివేసిన సంఘటనపై మున్సిపల్‌ కమిషనర్‌ వై.రంగస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్‌ కార్యాలయంలోని ఎన్నికల ఛాంబర్లలోకి గుర్తు తెలియని వ్యక్తులు భద్రతా వలయాన్ని ఛేదించుకుని ఎన్నికల నియమావళికి విఘాతం కలిగిస్తూ దౌర్జన్యంగా అధికారుల వద్ద ఉన్న నామినేషన్‌ పత్రాలను అపహరించుకు వెళ్లారని కమిషనర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ మేరకు కేసు నమోదు చేసినట్టు అర్బన్‌ సీఐ హాజీవలి తెలిపారు.

ఎమ్మెల్యే అనుచరులే

దాడి చేశారు

కడప కార్పొరేషన్‌ : తనపై ఎమ్మేల్యే మాధవిరెడ్డి అనుచరులే దాడి చేసి గాయపరిచారని ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేసేందుకు వచ్చిన ఫిజియోధెరపిస్ట్‌ డాక్టర్‌ జిలానీ ఆరోపించారు. జిలానీ 42 డివిజన్‌కు ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేసేందుకు అక్కడి వచ్చారు. అక్కడ నామినేషన్‌ పత్రాలను లాక్కొని మాధవిరెడ్డి మనుషులు దాడి చేశారని తెలిపారు. టీడీపీలో రెండున్నర సంవత్సరాలుగా ఎంతో కష్టపడ్డానని తనకు టికెట్‌ ఇవ్వకుండా వేరే వ్యక్తులకు ఇవ్వడం వల్లే ఇండిపెండెంట్‌గా వేసేందుకు సిద్దపడ్డానని తెలిపారు. ఇది మైనార్టీలకు అవమానమేనన్నారు. కార్పొరేషన్‌ మైనార్టీ వాయిస్‌ లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో ఇలా చేశారన్నారు.

ఎల్‌ఎల్‌బీ పరీక్షలు వాయిదా

కడప ఎడ్యుకేషన్‌ : యోగి వేమన విశ్వవిద్యాలయం ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించాల్సిన ఎల్‌ఎల్‌బీ 3, 5వ సంవత్సరం (2, 4, 6, 8 సెమిస్టర్లు) రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య టి.లక్ష్మి ప్రసాద్‌ తెలిపారు. మున్సిపల్‌, కార్పొరేషన్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల దృష్ట్యా విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షలు వాయిదా వేయాలని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్‌ ఆదేశాలిచ్చారన్నారు. వాయిదా పడిన పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.

పిడుగుపాటుకు గేదె మృతి

పులివెందుల రూరల్‌ : పులివెందుల పట్టణంలోని స్థానిక న్యాక్‌ బిల్డింగ్‌ సమీపంలో వైఎస్‌ఆర్‌ కాలనీలో నివాసముంటున్న అజయ్‌ కుమార్‌ రెండు గేదెలను పెట్టుకొని పాలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో పిడుగు పడటంతో ఇంటి ఆవరణంలో ఉన్న గేదె మృతి చెందింది. పాలు ఇచ్చే గేదే మృతి చెందడంతో బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

నాటుసారా స్థావరంపై దాడి

నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్‌) : మదనపల్లె ఎక్సైజ్‌, డీటీఎఫ్‌ బృందం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో నాటుసారా తయారీ సామగ్రి లభ్యమైనట్లు మదనపల్లె ఎకై ్సజ్‌ సీఐ భీమలింగ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందిన సమాచారం మేరకు నిమ్మనపల్లి మండలం, నాగులయ్యగారిపల్లె అటవీ ప్రాంతంలో అధికారులు తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 200 లీటర్ల బెల్లపు ఊటను గుర్తించారన్నారు. వెంటనే ఆ ఊటను అక్కడికక్కడే ధ్వంసం చేయడంతో పాటు, అక్కడ లభించిన 5 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement