పదవీ వ్యామోహంతో అక్రమాలకు పాల్పడుతున్నారు | - | Sakshi
Sakshi News home page

పదవీ వ్యామోహంతో అక్రమాలకు పాల్పడుతున్నారు

Oct 18 2026 2:18 AM | Updated on Oct 18 2026 2:18 AM

● రాఘవరెడ్డికి ఓటు హక్కు కల్పిస్తే 6,039 మంది కొత్త ఓటర్లకు అవకాశం ఇవ్వాలి

● మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

ప్రొద్దుటూరు : పదవీవ్యామోహంతో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అక్రమాలకు, అన్యాయాలకు తెరతీశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి కార్యాలయంలో శనివారం రాచమల్లు శివప్రసాదరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత వారం పది రోజులుగా ఎమ్మెల్యే తన సోదరుడైన రాఘవరెడ్డి ఓటు హక్కు కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ముందుగా మహేశ్వరరెడ్డి, రాజగోపాల్‌ యాదవ్‌ పేర్లను కూడా తెరపైకి తెచ్చి మళ్లీ రాఘవరెడ్డి కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. సాధారణంగా చేనేతలు ఎక్కువగా ఉన్న మున్సిపాలిటీలో చైర్మన్‌ పదవి బీసీ మహిళకు దక్కాల్సి ఉండగా రాఘవరెడ్డి కోసం ఓసీ జనరల్‌ కేటగిరికి తెచ్చుకున్నారన్నారు. మండలంలోని కామనూరు గ్రామంలో ఓటరుగా ఉన్న రాఘవరెడ్డి సర్‌ ప్రక్రియలో మున్సిపాలిటీకి బదిలీ చేసుకున్నారన్నారు. వాస్తవానికి ఆయన దరఖాస్తు చేసుకున్న చోట ఇల్లు లేదని, కార్యాలయం మాత్రమే ఉందన్నారు. ఆన్‌లైన్‌లో ఆయన ఓటు రిజిస్ట్రర్‌ అయిందని, ఓటర్‌ జాబితాలో ఆయన పేరు లేదన్నారు. దేశ వ్యాప్తంగా ఓటర్ల తుది జాబితా రావాల్సి ఉందని తెలిపారు. నిబంధనల ప్రకారం 2026 జనవరిలో తయారైన తుది ఓటర్ల జాబితాలో ఓటరుగా ఉంటేనే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 1,38,000 ఓట్లలో రాఘవరెడ్డి పేరు లేదని తెలిపారు. ఈనెల 15వ తేదీన తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకుని రాఘవరెడ్డి కలెక్టర్‌, డీఆర్‌ఓ, ఆర్డీఓ, తహసీల్దార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ను ఆశ్రయించారన్నారు. శతవిధాలా ప్రయత్నించినా ఓటర్‌ జాబితాలో పేరు లేనిది ఏమి చేయలేమని అధికారులు తెలిపారన్నారు. అదే రోజు సాయంత్రం మున్సిపల్‌ కమిషనర్‌కు ఆన్‌లైన్‌లో తన పేరు ఉందని ఓటు హక్కు కల్పించాలని లేఖ రాయడం, ఆయన లేఖను కలెక్టర్‌కు పంపడం జరిగిందన్నారు. శుక్రవారం హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటీషన్‌ వేయగా రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పిందే తప్ప ఓటు హక్కు కల్పించాలని మాత్రం చెప్పలేదన్నారు. 15వ తేదీ ఓటు లేదని చెప్పిన అధికారులు 17వ తేదీకి ఓటు ఎలా వస్తుందన్నారు. ప్రభుత్వం ఉందని అధికారులు రాఘవరెడ్డికి అవకాశం కల్పిస్తే అధికారులపై తాము సుప్రీంకోర్టుకు వెళతామన్నారు. చైర్మన్‌గా పోటీ చేసే రాఘవరెడ్డికి ఓటు హక్కు కల్పిస్తే 18 ఏళ్లు నిండి కొత్తగా ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న 6,039 మంది యువతకు అవకాశం కల్పించాలని కోరారు. స్క్రూటినీలో అయినా రాఘవరెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ హయాంలోనే పట్టణంలో అభివృద్ధి జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోలేదన్నారు. చైర్మన్‌గా తనను గెలిపిస్తే మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఓటర్లు తనను ఆదరించాలని కోరారు. పార్టీ కార్యకర్తలందరూ 52 మంది మున్సిపల్‌ కౌన్సిలర్లతోపాటు తన విజయం కోసం కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో పోరెడ్డి సందీప్‌రెడ్డి, పోరెడ్డి ప్రదీప్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement