● హింసకు తెగబడి చారిత్రాత్మక తప్పిదం చేశారు
● ఎమ్మెల్యే ఆకేపాటి, ఎంపీ మేడా
రాజంపేట టౌన్ : స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాజంపేటలో అనేక ఎన్నికలు అత్యంత ప్రశాంత వాతావరణంలో జరిగాయని, ఎన్నడూ లేనివిధంగా మున్సిపల్ ఎన్నికల సాక్షిగా తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులు, హత్యాయత్నాలకు తెగబడి ఇక్కడి శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. రౌడీయిజంతో కొత్త సంప్రదాయానికి తెరలేపి చారిత్రాత్మక తప్పిదం చేశారని, భవిష్యత్తులో టీడీపీ నాయకులు దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి ఘాటుగా హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా టీడీపీ శ్రేణులు సృష్టించిన దౌర్జన్యకాండపై శనివారం పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘అధికారం ఎప్పుడూ ఒకరి చేతుల్లోనే ఉండదన్న కనీస విషయాన్ని టీడీపీ నాయకులు గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో దౌర్జన్యాలు, దాడులు సరైన పద్ధతి కాదు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం ఖాయం. అప్పుడు మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’అని స్పష్టం చేశారు. నిజంగా బలం ఉంటే ఎన్నికల బరిలో తలపడాలని, ప్రజాబలం లేకపోవడం వల్లే టీడీపీ గూండాల స్థాయికి దిగజారిందని విమర్శించారు. పోలీసులు టీడీపీ అరాచకాలను నిలువరించి, నామినేషన్లు ప్రశాంతంగా జరిగేలా చూడాలని.. అలాకాకుండా కొమ్ముకాస్తే భవిష్యత్తులో శిక్ష తప్పదని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ మర్రి రవి, సీనియర్ నాయకులు గాలివీటి మదన్రెడ్డి పాల్గొన్నారు.


