సాక్షిటాస్క్ఫోర్స్ : కూటమి ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే కర్రలు, రాళ్లు, ఇనుపరాడ్లతో రౌడీ మూకల్లా వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి మండిపడ్డారు. శనివారం ఎర్రగుంట్లలో వైఎస్సార్సీపీ నాయకుడు తుంగ వెంకట్రామిరెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.మీకు అంతగా ధైర్యముంటే నామినేషన్లను ఎందుకు అడ్డుకుంటున్నారని కూటమి నాయకులను నిలదీశారు. ప్రజలను చూసి చంద్రబాబు భయపడుతున్నారని, మూడు పార్టీలు కలిసొచ్చినా వైఎస్సార్సీపీని ఎదుర్కొనే దమ్ము లేక దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులే చేతులెత్తేస్తే రాష్ట్రంలో పాలన ఎక్కడుందని ప్రశ్నించారు. అనంతరం నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని, పార్టీ శ్రేణులను పోలీసులు నాల్గు రోడ్ల కూడలి వద్ద అడ్డుకున్నారు.
ఎన్నికల కమిషన్ స్పందించాలి
కమలాపురం : కమలాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు ఎన్నికల కమిషన్ స్పందించి తమకు అవకాశం కల్పించాలని కమలాపురం మున్సిపల్ వైఎస్సార్ సీపీ చైర్ పర్సన్ అభ్యర్థి మారుజోళ్ల కవిత కోరారు. శనివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆమె అన్ని స్థానాల కౌన్సిలర్ సభ్యులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఈ రోజు నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా టీడీపీ గూండాలు అడ్డుకుని తన నామినేషన్ పత్రాలను లాక్కెళ్లి చించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాకు హక్కు లేదా అని ఆమె ప్రశ్నించారు. అలాంటపుడు నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వాలి? ఎన్నికల ప్రక్రియ ఎందుకు నిర్వహించాలి అని ఆమె ప్రశ్నించారు. పోలీసులు ఉన్నా చోద్యం చూస్తున్నారే తప్పా తమపై దాడులు చేస్తున్నా వారించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఎన్నికల కమిషన్ స్పందించి తమకు నామినేషన్ వేసే అవకాశం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.


