ఏపీలో రాజ్యాంగం కుప్పకూలిపోయింది: వైఎస్‌ జగన్‌ | YSRCP Chief YS Jagan Slams Chandrababu Sarkar Vendetta Politics | Sakshi
Sakshi News home page

ఏపీలో రాజ్యాంగం కుప్పకూలిపోయింది: వైఎస్‌ జగన్‌

Oct 17 2026 9:56 PM | Updated on Oct 17 2026 9:59 PM

YSRCP Chief YS Jagan Slams Chandrababu Sarkar Vendetta Politics

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా టీడీపీ గుండాలు జరిపిన దాడులు, పోలీసుల కాల్పుల ఘటనలపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు . ఈ మేరకు ట్వీట్‌ చేసిన వైఎస్‌ జగన్‌..  ఏపీలో జరుగుతున్న హింసాకాండపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం కుప్పకూలిపోయిందనడానికి వరుసగా జరుగుతున్న ఘటనలే ఉదాహరణలని మండిపడ్డారు.

పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ..
‘ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వరుసగా రెండోరోజూ చంద్రబాబు శాంతిభద్రతలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. తన పార్టీ మూకలకు గూండా లైసెన్స్‌లు ఇచ్చి, వారికి అండగా పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్నారు. రాజకీయ హింసావాదిగా తన చరిత్రను మరోసారి చాటుకుంటూ రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ను నడిపిస్తున్నారు. ప్రతిపక్ష అభ్యర్థులు కనీసం నామినేషన్లు కూడా వేయలేని దుస్థితి సృష్టించారు.  వైస్సార్‌సీపీ అభ్యర్థులను పోలీసుల సమక్షంలోనే, నామినేషన్ కేంద్రాల పరిధిలోనే,  కత్తులు, కర్రలతో వెంటాడటం, నామినేషన్ కేంద్రాలను ముట్టడించడం, ఆర్వో కార్యాలయాల్లోకే చొరబడి నామినేషన్ పత్రాలను లాక్కుని చించేయడం, అర్ధరాత్రి అభ్యర్థులను పోలీసులు ఎత్తుకెళ్లడం..ఇదీ చంద్రబాబు మార్కు ప్రజాస్వామ్యం!’అంటూ ధ్వజమెత్తారు.

ఎంపీలకే రక్షణ లేని రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి?
‘ఎన్నికలను ఏకపక్షంగా మార్చేందుకు అధికార బలంతో హింసను ప్రేరేపిస్తున్నారు. దారుణమేమిటంటే, అభ్యర్థులకు ప్రపోజర్లుగా వెళ్లిన మా పార్టీ ఎంపీలను కూడా వదల్లేదు. వారి చేతుల్లోంచి నామినేషన్ పత్రాలను లాక్కుని చించేశారు. ముగ్గురు ఎంపీలపై పోలీసుల సమక్షంలోనే పోలీసుల ద్వారానే దాడులు జరిగాయి. ఎంపీలకే రక్షణ లేని రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి?, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, రాజంపేట, రాయచోటి, పుంగనూరు, తిరుపతి, దర్శి, దాచేపల్లి, గురజాల సహా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలు చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా దిగజారిపోయిందో కళ్లకు కట్టినట్లు  కనిపిస్తోంది. పులివెందులలో పోలీసుల కాల్పులు ప్రజాస్వామ్యంపై పేల్చిన తూటాలే.దీని వెనుక ముమ్మాటికీ చంద్రబాబుగారి కుట్రే!’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఎందుకు  కాల్పులు జరిపారు?
‘నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులను, ప్రపోజెర్స్ పై పోలీసులు దాడి చేసి ఎందుకు కొట్టారు?, ఎందుకు  కాల్పులు జరిపారు?, చంద్రబాబూ.. నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం ఎన్నికలా?, ప్రతిపక్ష అభ్యర్థులను పోలీసులతో ఎత్తుకెళ్లడం ప్రజాస్వామ్యమా?, ఎంపీలపైనే దాడులు చేయించడం రాజ్యాంగ పాలనా?, రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నాను. సూపర్  6, సూపర్ 7ల మోసాలతో ప్రజలకు  బాండ్లు ఇచ్చి మరీ మోసం చేసిన ఈ వెన్నుపోటు పార్టీ నుంచి ఇంతకన్న ఏమి ఆశించగలం?’ అని ప్రశ్నించారు. 

ఇదీ చదవండి: పులివెందులలో ఏకే 47తో కాల్పులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement