‘ప్ర‌భుత్వం, పోలీసులు, ఎన్నిక‌ల సంఘం కుమ్మ‌క్కు’ | YSRCP Leader TJR Sudhakar Babu Slams Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘ప్ర‌భుత్వం, పోలీసులు, ఎన్నిక‌ల సంఘం కుమ్మ‌క్కు’

Oct 17 2026 5:48 PM | Updated on Oct 17 2026 6:10 PM

YSRCP Leader TJR Sudhakar Babu Slams Chandrababu Govt
  • పోలీసుల క‌ళ్లెదుటే టీడీపీ గూండాల దాడులు, రౌడీయిజం
  • ఎన్నిక‌ల అధికారుల చేతుల్లోంచి నామినేష‌న్ ప‌త్రాలు లాక్కెళ్తున్న వైనం
  • వైఎస్సార్సీపీ అభ్య‌ర్థుల‌పై దాడులు చేస్తున్నా పోలీసుల చోద్యం
  • వీడియో ఆధారాల‌తో స‌హా ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోని ఎన్నిక‌ల సంఘం
  • అరాచకాల‌ను ఆధారాల‌తో స‌హా చూపించిన సుధాక‌ర్ బాబు

తాడేప‌ల్లి:  పోలీసులు కళ్లెదుటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై టీడీపీ గూండాలు దాడులు చేసి నామినేషన్ పత్రాలు లాక్కుని చింపుతుంటే, ఎన్నికల అధికారుల చేతుల్లోంచి పేపర్లు లాక్కుని పోతున్న పరిస్థితులు చూస్తుంటే.. అసలు రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నాయా లేక చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో జరుగుతున్నాయా అనే అనుమానం కలుగుతోందని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు టీజేఆర్ సుధాక‌ర్ బాబు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.  

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ అభ్యర్థులతో కలిసి వైఎస్సార్‌సీపీ ఎంపీలు స్వయంగా రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు ఇస్తున్నప్పటికీ, ఎన్నికల అధికారులు వాటిని స్వీకరించకుండా కావాలనే కాలయాపన చేస్తూ, టీడీపీ నాయకుల ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారని మండిప‌డ్డారు. 

ప్రభుత్వ అండతో పోలీసు శాఖ పూర్తిగా పచ్చ కండువా కప్పుకుని, ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి అధికార పార్టీకి వంత పాడుతుండటం ఈ కుమ్మక్కు రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం అన్నారు. తిరుపతి, కడప, రాయచోటి, పొన్నూరు, ధర్మవరం, పులివెందుల తదితర ప్రాంతాలలోవైఎస్సార్‌సీపీ నాయకులు, అభ్యర్థులపై కత్తులు, కర్రలు, రాళ్లతో దాడి చేసి రక్తపాతం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.వైఎస్సార్‌సీపీ లోక్‌స‌భాప‌క్ష నేత మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై, ఆయన సెక్యూరిటీ సిబ్బందిపై దాడులే ఇందుకు నిదర్శనమన్నారు.

వైఎస్సార్సీపీ నాయకులను అక్రమంగా అర్ధరాత్రి హౌస్ అరెస్టులు చేయడం, పిడి యాక్ట్లు బనాయించడం, పాత కేసులపై బైండోవర్లు చేయడం ద్వారా పోలీసు వ్యవస్థ పూర్తిగా టీడీపీకి తొత్తుగా మారిందని విమర్శించారు. నిష్ప‌క్ష‌పాతంగా స్వేచ్ఛా వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌లు జ‌రిగితే గెలిచే ప‌రిస్థితి ఉండ‌ద‌నే భ‌యంతోనే చంద్ర‌బాబు ర‌క్త‌పాతం సృష్టిస్తున్నార‌ని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.  

ప్ర‌భుత్వం, పోలీసులు, ఎన్నిక‌ల సంఘం కుమ్మ‌క్కు!:
ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యానికి, చట్టానికి, ఎన్నికల వ్యవస్థకు తీవ్ర పరీక్ష ఎదురవుతోంది. చంద్రబాబు నాయుడు రెండున్నరేళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే భయంతోనే స్థానిక ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి దాడులు, దౌర్జన్యాలకు తెరలేపాడు. పోలీసులను అడ్డం పెట్టుకునివైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. 

ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కాలరాస్తూ, ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునే అవకాశాన్ని దెబ్బతీయడం ప్రజాస్వామ్యమా? రాష్ట్రంలో ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయా, లేక చంద్రబాబు కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయా అని అనుమానం క‌లుగుతోంది. పొన్నూరు, రాయచోటి, కడప, తిరుపతి, పులివెందుల, దాచేపల్లి తదితర ప్రాంతాల్లో జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, ఇతర ఆధారాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం. ఎన్నికల సంఘం ఎదుటే ఎస్పీలు, కలెక్టర్లకు ఫోన్లు చేసి చర్యలు తీసుకోవాలని సూచించినా, ఇప్పటివరకు బాధ్యులపై తగిన చర్యలు కనిపించడం లేదు. కళ్లముందు ఆధారాలు ఉన్నా చర్యలు తీసుకోకపోతే ఎన్నికల సంఘం ఉద్దేశం ఏమిటి?పోలీసులే టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారనే పరిస్థితి కనిపిస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఎవరు?

ఇదేనా చంద్రబాబు మార్కు కేస్ స్టడీ?
పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి గారి కాన్వాయ్‌పై జరిగిన దాడి విషయంలో డీఐజీ కోయ ప్రవీణ్, అన్నమయ్య జిల్లా ఎస్పీ చేస్తున్న వాదనలకు వీడియాల్లో క‌నిపిస్తున్న వాస్త‌వాల‌కు విరుద్ధంగా ఉన్నాయి. మిథున్ రెడ్డి గారు తన  అభ్యర్థులతో క‌లిసి నామినేషన్ల కోసం వెళ్లినప్పుడు, దాడి ఘటనలో గాయాలైన పరిస్థితుల్లో కూడా నామినేషన్ పత్రాలు స్వీకరించాలని రిటర్నింగ్ అధికారిని బతిమాలుకోవాల్సి వచ్చిందంటే ఇంతకంటే దురదృష్టకరమైన పరిస్థితి ఏముంటుంది? ఒక లోక్‌సభ సభ్యుడే నామినేషన్ పత్రాలు స్వీకరించాలని వేడుకోవాల్సి వస్తే సామాన్య అభ్యర్థుల పరిస్థితి ఏమిటి? ఎంపీ భద్రతా సిబ్బందిపైనే దాడులు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నా, దాడికి పాల్పడినవారిని గుర్తించి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? దాడికి సంబంధించిన వాస్తవాలను వెల్లడించకుండా బాధితులపైనే ఆరోపణలు చేయడం సరైంది కాదు. ధ్వంసమైన కార్లలో మద్యం బాటిళ్లు ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. కార్లు బోల్తా పడినా మద్యం బాటిళ్లు నిటారుగా నిలబడ్డాయట! ఇదేనా చంద్రబాబు మార్కు కేస్ స్టడీ?

రాయచోటిలోవైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేసి, పెట్రోల్‌తో నిప్పంటించారు. వాహనాలను కర్రలతో కొడుతూ, పెట్రోల్ పోస్తున్నట్లు కనిపిస్తున్న దృశ్యాలపై విచారణ జరపాలి.వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి, వాహనాలకు నిప్పు పెట్టినవారు ఎవరు? వారిని గుర్తించడానికి పోలీసులకు ఉన్న ఇబ్బంది ఏమిటి? రాయచోటిలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి దాడికి పాల్పడినవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పత్రాలు లాక్కోవడమేంటి?
తిరుపతిలో ఎంపీ గురుమూర్తి గారు అభ్యర్థి నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు వెళ్లినప్పుడు, ఆయన చేతుల్లోని పత్రాలను లాక్కుని చించివేశారు. ఒక దళిత ఎంపీ తన పార్టీ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడానికి వెళ్లినప్పుడు అడ్డంకులు సృష్టించడం, ఆయన చేతిలోని పత్రాలను లాక్కునే పరిస్థితి ఏర్పడటం దుర్మార్గం. కడపలో కత్తులు, కర్రలు, రాళ్లతో దాడులు జరిగినట్లు, అభ్యర్థులు, పార్టీ నాయకులు గాయపడినట్లు ఎన్నో ఫిర్యాదులిచ్చాం. 

పులివెందులలో నామినేషన్ ప్రక్రియను అడ్డుకోవడంతో పరిస్థితి కాల్పుల వరకు వెళ్లింది. ఈ ఘటనలన్నింటిపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాలి. గురజాల, మాచర్ల, పిడుగురాళ్ల, దాచేపల్లి ప్రాంతాల్లోవైఎస్సార్‌సీపీ నాయకులను గృహనిర్బంధం చేశారు. కొందరిని అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. పాత కేసులు, బైండోవర్ చర్యల పేరుతో అభ్యర్థులను భయపెట్టి నామినేషన్లకు దూరం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చర్యలకు సంబంధించిన చట్టపరమైన కారణాలను పోలీసులు వెల్లడించాలి.

కోయ ప్ర‌వీణ్‌ని ఎన్నిక‌ల బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించాలి
అభ్యర్థులు నామినేషన్లు సమర్పించడానికి వెళ్తున్నప్పుడు వారిని అడ్డుకోవడం, దాడులు చేయడం, ఆ తరువాత వారినే నిర్బంధించడం ప్ర‌జాస్వామ్య‌మా? దాడి చేసినవారు ఎవరైనా సరే వారిని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులదే.వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఒకరికి మాత్రమే ప్రవేశం అంటూ ఆంక్షలు విధిస్తూ, టీడీపీకి చెందినవారు వందల సంఖ్యలో ప్రవేశిస్తున్నారనే ఫిర్యాదులపై కూడా విచారణ జరగాలి. ఒకే ఎన్నికలో రెండు పార్టీలకు రెండు రకాల నిబంధనలు ఎలా ఉంటాయి? ఎన్నికల కేంద్రాల్లో సమానత్వం పాటించకపోతే ఎన్నికల ప్రక్రియపై నమ్మకం ఎలా కలుగుతుంది?

కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్‌తో పాటు చిత్తూరు, అన్నమయ్య, కడప, తిరుపతి, పల్నాడు జిల్లాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పోలీసు అధికారుల పాత్రపై విచారణ జరపాలి. పక్షపాతం లేదా నిర్లక్ష్యం ఉన్నట్లు తేలిన అధికారులను ఎన్నికల బాధ్యతల నుంచి తక్షణమే తప్పించాలి. పోలీసులు చట్టం ప్రకారం పనిచేయాలి. అధికార పార్టీకి చెందినవారిపై ఒక విధంగా, ప్రతిపక్షంపై మరో విధంగా వ్యవహరించకూడదు. ఎన్నికల కేంద్రాల వద్ద భద్రత, నామినేషన్ల స్వీకరణ, అభ్యర్థుల స్వేచ్ఛ వంటి అంశాలపై ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. ప్రతి ఫిర్యాదుపై తీసుకున్న చర్యలను ప్రజలకు తెలియజేయాలి.

చంద్రబాబుకు సవాల్.. 
పోలీసులను అడ్డం పెట్టుకుని లోకేష్‌ను హీరోగా చూపించే ప్రయత్నం జ‌రుగుతోంది. నాయకత్వం అనేది ప్రచార ఎలివేషన్లతోనో, అధికార యంత్రాంగం అండతోనో రాదు. ప్రజలతో సంబంధాలు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధత ద్వారా నాయకత్వం నిరూపించుకోవాలి. పంజాబ్, ఢిల్లీ, కర్ణాటక నుంచి గూండాలను తీసుకొచ్చారంటూవైఎస్సార్‌సీపీపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు నాయుడు, ఆ ఆరోపణలకు ఆధారాలు చూపించాలి. ఆ వ్యక్తులు ఎవరు? వారి పేర్లు ఏమిటి? వారు ఏ ఘటనల్లో పాల్గొన్నారు? అన్న వివరాలను ప్రజల ముందు పెట్టాలి. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ అసలు దాడుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించకూడదు.

పోలీసుల‌ను రాజ‌కీయాల‌కు దూరంగా ఉంచండి
చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్‌కు మేము చెబుతున్నది ఒక్కటే. మీ పాలనపై మీకు నమ్మకం ఉంటే పోలీసు వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచండి. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలకు తావివ్వకండి. ప్రతి అభ్యర్థికి నామినేషన్ వేసే అవకాశం కల్పించండి. దాడులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోండి. ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థికి స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణాన్ని కల్పించండి. నామినేషన్లు వేయనివ్వకపోతే ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నట్లు? అభ్యర్థులను భయపెట్టి, నామినేష‌న్్ పత్రాలను లాక్కొని, దాడులు చేసి, ఆ తరువాత ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని చెప్పడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. రాష్ట్ర ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకుని అన్ని ఘటనలపై విచారణ జరపాలి. ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాల‌ని టీజేఆర్ సుధాక‌ర్ బాబు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: పులివెందులలో ఏకే 47తో కాల్పులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement