తాడేపల్లి: స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో కూటమి ప్రభుత్వ పెద్దలు అరాచకాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా నామినేషన్లు వేసే వాతావరణం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని చోట్ల టీడీపీ గూండాలు బరితెగిస్తున్నారని, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అసలు ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారో అర్థం కావడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు కాల్పులు జరిపారని విమర్శించారు. పోలీసులే దాడులు చేస్తున్నారని, దీనికి ఎన్నికలు ఎందుకుని ప్రశ్నించారు. నామినేషన్ల ప్రక్రియలో అరాచకాలకు పాల్పడుతున్నారని, అన్ని చోట్ల టీడీపీ గూండాలు బరి తెగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల అధికారులు నామినేషన్ల పత్రాలు తీసుకోవడం లేదని. పుంగనూరు, రాయచోటి, పులివెందులలో అరాచకాలకు పాల్పడ్డారని,. ఈ తరహా పరిస్థితులు చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా జరిగే పరిస్థితి లేదన్నారు. కూటమి ప్రభుత్వం అరాచకాలపై తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన సజ్జల.. తమను నైతికంగా ఎదుర్కోలేక చంద్రబాబు ఈ దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే దాడులు..
‘టీడీపీకి ఎన్నికలంటే భయం. ఏపీలో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఆర్గనైజ్డ్ క్రైమ్‌కు పాల్పడింది. టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదు. ఎన్నికల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. ముందస్తు కుట్రతోనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. 15 లక్షల మృతుల ఓట్లు సహా మొత్తం 44 లక్షల అనుమానాస్పద ఓట్లు ఉన్నా హడావుడిగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఓటర్ల జాబితా సవరణ పూర్తికాకముందే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది?, రిజర్వేషన్లు చివరి నిమిషంలో ప్రకటించి.. కేవలం 12 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగించే కుట్ర చేశారు. నామినేషన్లకు రోజుకు నాలుగు గంటలే ఇచ్చి.. ఆ సమయంలోనూ అభ్యర్థులను అడ్డుకుంటున్నారు. నామినేషన్ వేయనివ్వకుండా గెలవాలనుకోవడం చంద్రబాబు రాజకీయ పిరికితనం. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీడీపీ గూండాలను రంగంలోకి దించారు
పోలీసులను కిరాయి సైన్యంలా మార్చారు..
టీడీపీ గూండాలకు పోలీసులు రక్షణ కల్పిస్తూ.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు చేస్తున్నారు. పోలీసులను కిరాయి సైన్యంలా మార్చి చంద్రబాబు ఎన్నికల అరాచకాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల సంఘం డమ్మీగా మారింది. పోలీసులే సర్వాధికారులుగా వ్యవహరిస్తున్నారు. పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడి చేయడమే కాకుండా.. నాలుగు గంటలు వేచి ఉన్నా అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించలేదు. పులివెందులలో పోలీసులే వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు దిగడం అత్యంత దారుణం. పోలీసులు చెప్పిన సమయానికే వెళ్లినా ఎంపీ అవినాష్‌రెడ్డి వెంట వచ్చిన అభ్యర్థులను అడ్డుకున్నారు. తిరుపతిలో ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం చేతిలోని నామినేషన్ పత్రాలను చించేశారు. మధ్యాహ్నం మళ్లీ నామినేషన్ వేసేందుకు వెళ్లినా మూడు గంటల వరకు అడ్డుకుని వెనక్కి పంపించారు
ప్రతిపక్ష అభ్యర్థి నామినేషన్ వేస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటి?
రాయచోటిలో వైయస్సార్సీపీ కార్యాలయంపైనే దాడికి దిగారు. గురజాలలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనే కారణంతో వైయస్సార్సీపీ నాయకులను అక్రమంగా తీసుకెళ్లారు. రాజంపేట, దర్శి, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల సహా అనేక ప్రాంతాల్లో నామినేషన్లను అడ్డుకున్నారు. ప్రతిపక్ష అభ్యర్థి నామినేషన్ వేస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టమేంటి?, ప్రజలు తమ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తారనే భయంతోనే చంద్రబాబు ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ పనితీరుపై నమ్మకముంటే ప్రతిపక్షాన్ని స్వేచ్ఛగా పోటీ చేయనివ్వాలి. ప్రజల తీర్పును ఎదుర్కొనే ధైర్యం లేకనే నామినేషన్ల దశలోనే ప్రత్యర్థులను తొలగించే కుట్ర చేస్తున్నారు. దాడుల వీడియోలు కళ్లముందే ఉన్నా అధికారులు స్పందించకపోవడం దారుణం
మాకు ప్రజలే రక్షణ.. ప్రజల తీర్పుపైనే మాకు నమ్మకం
వైఎస్సార్సీపీపై దాడులు చేసి.. తిరిగి మా నాయకులపైనే తప్పుడు కేసులు పెడుతున్నారు. తానే ఆటగాడు.. తానే రిఫరీ.. తానే విజేత అని ప్రకటించుకోవడం ఎన్నికలు కాదు. ప్రతిపక్షం లేకుండా గెలిచామని చెప్పుకోవడం చంద్రబాబుకు ఆత్మసంతృప్తి తప్ప ప్రజాతీర్పు కాదు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో పోలీసు వ్యవస్థను చంద్రబాబు పూర్తిగా భ్రష్టుపట్టించారు. డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారులు కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం దురదృష్టకరం. నామినేషన్లకే ఇంత హింస సృష్టిస్తే.. రేపు పోలింగ్‌లో ఓటర్లకు రక్షణ ఏది?, రేపటి నామినేషన్లలో ప్రతి అభ్యర్థి స్వేచ్ఛగా పత్రాలు సమర్పించేలా ప్రభుత్వం, ఎన్నికల సంఘం బాధ్యత తీసుకోవాలి. అభ్యర్థులందరూ నిర్భయంగా నామినేషన్లు వేయవచ్చని డీజీపీ బహిరంగ ప్రకటన చేయాలి. ఎన్నికల అక్రమాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం.. ప్రజల ముందుకు ఆధారాలు తీసుకెళ్తాం
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న అధికారులు, నాయకులందరినీ గుర్తుంచుకుంటాం. దాడులు, బెదిరింపులు, తప్పుడు కేసులతో వైయస్సార్సీపీని భయపెట్టలేరు. వైఎస్ జగన్ నాయకత్వంలో ఎలాంటి ఆటుపోట్లనైనా ఎదుర్కొనే సత్తా వైఎస్సార్సీపీకి ఉంది. మాకు ప్రజలే రక్షణ.. ప్రజల తీర్పుపైనే మాకు నమ్మకం. చంద్రబాబు ఎన్ని అడ్డదారులు తొక్కినా ప్రజల తీర్పును అడ్డుకోలేరు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు’ అని హెచ్చరించారు.
ఇదీ చదవండి: టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్: అవినాశ్ రెడ్డి


