పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసులు మరోసారి లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై లాఠీఛార్జ్ జరిగింది. టీడీపీ గూండాల చేతుల్లో కర్రలు, రాడ్లు, వేటకొడవళ్లు, పెట్రోల్ ఉన్నాయని వైఎస్సార్సీపీ నేత, ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి అన్నారు. టీడీపీ గూండాలను వదిలేసి తమపై లాఠీఛార్జ్ చేశారని తెలిపారు.
ఎన్నికల కమిషన్ ఉన్నట్టా? లేనట్టా? అని అన్నారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ మొద్దునిద్ర వీడాలని చెప్పారు. ఇది పిరికి పందెల ప్రభుత్వమని అన్నారు. నామినేషన్ కోసం పోలీసులు మధ్యాహ్నం 1.30 గంటలకు రమ్మన్నారని తెలిపారు. ఇక్కడికి వచ్చాక.. ఇవాళ వద్దు.. రేపు రమ్మంటున్నారని చెప్పారు. ఇవాళ నామినేషన్ వేసే రైట్ తమకెందుకు లేదని అవినాశ్ రెడ్డి ప్రశనించారు.
కాల్పులు జరుపుతున్నారు..
పోలీసులే తమపై దాడులు చేస్తున్నారని, కాల్పులు జరుపుతున్నారని అవినాశ్ రెడ్డి అన్నారు. ‘‘పోలీసుల ఫైరింగ్లో మా కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఒక కార్యకర్త కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. మరో కార్యకర్త చెవికి తీవ్రగాయమైంది. పోలీసుల ఫైరింగులో ఇంకో కార్యకర్త వేలు విరిగింది. మేం టీడీపీని కాదు.. పోలీసులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పోలీసులే స్వయంగా మాపై రాళ్ల దాడి చేస్తున్నారు. పారదర్శకంగా ఎన్నికలు జరిపే దమ్ము కూటమికి లేదు. పోలీసులను అడ్డం పెట్టుకుని కుట్రలు చేస్తున్నారు’’ అని తెలిపారు.
ఇదీ చదవండి: పులివెందులలో కాల్పులు


