కడప జిల్లాలో కిరాతకం | Stone pelting attacks on YSRCP ranks in YSR Kadapa district | Sakshi
Sakshi News home page

కడప జిల్లాలో కిరాతకం

Oct 18 2026 3:06 AM | Updated on Oct 18 2026 3:06 AM

Stone pelting attacks on YSRCP ranks in YSR Kadapa district

బద్వేల్‌ వైఎస్సార్‌సీపీ 14వ వార్డు అభ్యర్థి మాబుచాన్, మాజీ కౌన్సిలర్‌ హసాన్‌పై పోలీసుల సమక్షంలోనే దాడి చేస్తున్న టీడీపీ నేతలు

పులివెందులలో పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ   

రౌడీలు, గూండాల అవతారమెత్తిన పోలీసులు

టీడీపీ రౌడీ మూకలకు వకాల్తా పుచ్చుకున్నట్లు బరితెగించి దౌర్జన్యం

వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రాళ్లదాడులు.. టియర్‌ గ్యాస్‌ ప్రయోగం.. కాల్పులు 

నామినేషన్లు వేయకుండా అడుగడుగునా అడ్డగింపు

పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

జిల్లా అంతటా పోలీసుల దన్నుతో రెచ్చిపోయిన పచ్చ మూకలు  

కూటమి అభ్యర్థులు మినహా నామినేషన్‌ వేసేందుకు ఎవరొచ్చినా ప్రత్యక్ష దాడులు 

కడపలో మాజీ ఇన్‌ఛార్జి మేయర్‌ కుమారుడు మురాద్‌కు కత్తిపోటు 

గాంధీనగర్‌ హైస్కూల్‌ వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రాళ్ల దాడులు 

పలువురు మీడియా ప్రతినిధులపై కూడా రౌడీల దాడి

కడపలో వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి మౌన దీక్ష

ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన కరువు

సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్‌ కడప జిల్లాలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. ప్రభుత్వ దన్నుతో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పోలీసులే పచ్చ ముసుగు వేసుకుని దాడులకు పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ నేతల వాహనాలను పోలీసులే ధ్వంసం చేయడం విస్తుగొలిపింది. ఆపై వైఎస్సార్‌సీపీ శ్రేణులను చెల్లాచెదురు చేయాలనే లక్ష్యంతో టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడంతోపాటు గాల్లోకి కాల్పులు జరిపారు. నామినేషన్‌ వేసేందుకు వస్తున్న కౌన్సిలర్‌ అభ్యర్థులను అడ్డుకున్నారు. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సహా నేతలెవ్వరినీ పోలీసులు లోపలికి అనుమతించలేదు. 

శనివారం సమయం ముగిసే వరకు నామినేషన్‌ సెంటర్‌లోకి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పంపకుండా దౌర్జన్యంగా వ్యవహరించారు. పోలీసులే స్వ­యంగా వైఎస్సార్‌సీపీ నేతలపైకి రాళ్లు రువ్వారు. మరొక వైపు ఏకే 47తో కాల్పులకు దిగారు. నామినేషన్‌ సెంటర్‌ దగ్గర టీడీపీ గూండాలు మోహరించినా వారిని కట్టడి చేయలేదు. పైగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై మాత్రం ప్రతాపం చూపించారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై ప్రత్యక్ష దాడులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదు. 

బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 163 అమలు టీడీపీ రౌడీలకు వర్తించ లేదు. వందల సంఖ్యలో రౌడీ మూకలు తిష్ట వేసి.. నామినేషన్లు వేసేందుకు వస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై విరుచుకుపడ్డారు. జిల్లాలోని వేంపల్లె, చక్రాయపేట, సింహాద్రిపురం మండలాల నుంచి భారీగా తరలివచ్చిన టీడీపీ మూకలు విచ్చలవిడిగా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. పోలీసుల దాష్టీకానికి నిరసనగా పులివెందులలో ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు రోడ్డుపై ధర్నాకు దిగారు.  

పోలీసుల అండతో రెచ్చిపోయిన పచ్చ మూకలు
రెండవ రోజు మున్సిపల్‌ నామినేషన్ల సందర్భంగా జిల్లావ్యాప్తంగా పచ్చ మూక చెలరేగిపోయింది. కడప కోటిరెడ్డి కాలేజీ వద్ద వైఎస్సార్‌సీపీ అభ్యర్థి త్యాగరాజుపై దాడి చేసి నామినేషన్‌ పత్రాలు చించివేశారు. కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి తిష్టవేసి.. నామినేషన్లు వేయకుండా అనుచరుల ద్వారా అడ్డగించారు. మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్‌ యాదవ్‌ నామినేషన్ల కేంద్రంలోకి వెళ్లి అప్పటికే దాఖలు చేసిన నామినేషన్‌ పేపర్లు చించేశారు. బద్వేల్‌ ఇన్‌ఛార్జి సూర్యనారాయణరెడ్డి సైతం నామినేషన్ల కేంద్రం నుంచి అప్పటికే దాఖ­లు చేసిన నామినేషన్‌ పత్రాలు ఎత్తుకెళ్లారు. యర్రగుంట్లలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సోదరుడి కుమారుడు రాజేష్‌ కర్రలు పట్టుకొని నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ఇంటిపై పచ్చమూకలు దాడి చేశాయి. అక్కడ ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను విచక్షణా రహితంగా కొట్టారు. 

కాపు కాసి అడ్డుకున్న పోలీసులు 
శనివారం ఉదయం నుంచే జిల్లా పోలీసు యంత్రాంగం వ్యూహాత్మకంగా వైఎస్సార్‌సీపీ నేతల్ని కట్టడి చేసింది. హౌస్‌ అరెస్టు చేస్తున్నట్లు నోటీసులు జారీ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డిని పార్టీ కార్యాలయంలో దిగ్బంధించారు. మాజీ మంత్రి ఎస్‌బీ అంజాద్‌బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్‌ సురేష్‌­బాబు, పాకా సురేష్‌లను గృహ నిర్బంధం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలెవ్వరూ నామినేషన్ల కార్యాలయాలకు వెళ్లకుండా పోలీసులు కాపు కాశారు. ఆపై టీడీపీ నేతల్ని విచ్చలవిడిగా అనుమతించి, వారి ద్వారా పోలీసులే దగ్గరుండీ అరాచకం సృష్టించారు. నామినేషన్లు వేయడానికి వస్తున్న వారిపై పచ్చ మూక దాడులకు పాల్పడుతుంటే.. పోలీసులు ఆపినట్లుగా నటించడం ఆరంభించారు. 

ఆ తర్వాత అయినా నామినేషన్‌కు అనుమతించారా.. అంటే అదీ లేదు. వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులే వెనక్కి పంపించేశారు. కడపలోని గాంధీనగర్‌ హైస్కూల్‌ వద్ద వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శ్యాంసన్‌ నామినేషన్‌ వేసేందుకు వెళ్తుండగా టీడీపీ నేత లోమడ మోహన్‌రెడ్డి అడ్డగించారు. ఆపై టీడీపీ శ్రేణులు ఇష్టానుసారం దాడి చేయడంతో శ్యాంసన్‌ అక్కడే పడిపోయారు. అడ్డుగా నిలిచి మహిళలు ఆయన ప్రాణాలు కాపాడారు. అనంతరం శ్యాంసన్‌ కోలుకుని.. బారికేడ్లు దాటి, నామినేషన్‌ వేసేందుకు వెళ్తుండగా ఎస్‌ఐ రాజరాజేశ్వరరెడ్డి అడ్డగించారు. ఈలోపు మళ్లీ పచ్చ గూండాలు దాడికి దిగారు. ఇలా ఎక్కడికక్కడ పోలీసులే వ్యూహాత్మకంగా అడ్డుగా నిలవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు.

మీడియా ప్రతినిధులపైనా దాడులు
నామినేషన్లు ఘట్టం సందర్భంగా వైఎస్సార్‌ కడప జిల్లాలో మీడియా ప్రతినిధులకు సైతం వేధింపులు తప్పలేదు. రాజంపేటలో సాక్షి టీవీ జర్నలిస్టు రవిని నిర్బంధించారు. బద్వేలులో టీడీపీ రౌడీలు సాక్షి విలేకరి ఫోన్‌ లాక్కున్నారు. కమలాపురంలో సాక్షి విలేకరిపై టీడీపీ రౌడీలు దౌర్జన్యం చేశారు. పులివెందులలో దాడి ఘటనలను చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై టీడీపీ గూండాలు బీరు బాటిళ్లతో దాడి చేశారు. టీవి9, 10టీవీ, 6టీవి రిపోర్టర్ల తలలు పగలగొట్టారు. టీడీపీ గూండాల దాడిలో జర్నలిస్టులకు తీవ్రగాయాలైనా, పోలీసులు చూస్తుండిపోయారు. టీడీపీ గూండాలను కనీసం నిలువరించకపోవడం గమనార్హం.

ఫిర్యాదు చేసినా స్పందన కరువు
జిల్లా కేంద్రం కడపలో, పులివెందులలో పచ్చమూకలు విచ్చలవిడిగా దౌర్జన్యం చేస్తుండటంపై ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేస్తున్నా ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్, కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ నుంచి ఏమాత్రం స్పందన లేదని వైఎస్సార్‌సీపీ నేతలు వాపోయారు. ఓవైపు 144 సెక్షన్‌ అమలులో ఉంది.. నామినేషన్లు నిక్షేపంగా వేసుకోవచ్చని కలెక్టర్‌ ప్రకటన జారీ చేస్తారు.. మరో వైపు క్షేత్రస్థాయిలో పోలీసులే అడ్డుగా నిలిచి నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు.. ఏమిటీ పరిస్థితి.. ఇలా ఎప్పుడూ జరగలేదు.. అని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌సీపీ నేతమురాద్‌కు కత్తిపోటు
మాజీ ఇన్‌ఛార్జి మేయర్‌ ముంతాజ్‌బేగం కుమారుడు డాక్టర్‌ మురాద్‌ తన తల్లితో నామినేషన్‌ వేయించేందుకు కాగితాలపెంట నామినేషన్‌ కేంద్రానికి వెళ్తుండగా వెనుక వైపు నుంచి వచ్చిన టీడీపీ గూండాలు కత్తితో పొడిచి పారిపోయారు. పోలీసులు చూస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. నామినేషన్ల అడ్డగింతపై కడపలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద మేయర్‌ అభ్యర్థి బండి దీప్తిరెడ్డి మౌన దీక్ష చేపట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. 

‘నామినేషన్‌ పత్రాలు చింపివేయడం.. అభ్యర్థులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా? రక్షణ కల్పించాల్సిన పోలీసులే పచ్చ మూకలకు అండగా నిలుస్తారా? అధికార పార్టీకి ఒక న్యాయం.. ప్రతిపక్షానికి మరో న్యాయమా?’ అని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథ్‌ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, పలువురు పార్టీ నేతలు దీక్షలో పాల్లొని సంఘీభావం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement