సూపర్ సిక్స్ హామీలు అమలు చేయని చంద్రబాబు.. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్ధం
చంద్రబాబు కూటమికి ఓటమి భయం
బ్యాలెట్ వరకు ఎన్నికలు రాకుండా టీడీపీ గూండాయిజం
పోలీసులనే ఆయుధంగా మార్చుకున్న చంద్రబాబు
టీడీపీ గూండాలకు అండగా ఖాకీలు
దాడి చేసేది పచ్చ మూకలు.. కేసులు, అరెస్టులు ప్రతిపక్ష నేతలపైన
దాడులకు ఎదురొడ్డి నామినేషన్లు దాఖలు చేస్తున్న వైఎస్సార్సీపీ
సాక్షి, అమరావతి: ప్రజాక్షేత్రంలో ఓటుతో నెగ్గలేమని స్పష్టమైపోవడంతో చంద్రబాబు కూటమి ఖాకీలనే కవచంగా చేసుకుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు వస్తున్న వైఎస్సార్సీపీ అభ్యర్థులు, నేతలపై పచ్చ గూండాలు రాళ్లు, కర్రలతో విరుచుకుపడితే.. వారికి పోలీసులే అండగా నిలుస్తున్నారు. పోలీసులే విపక్ష అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించేస్తున్నారు. కాల్పులకూ దిగుతున్నారు. పైపెచ్చు.. దాడులు చేసిన వారిని వదిలేసి, నామినేషన్లు వేయాల్సిన ప్రతిపక్ష నేతలపైనే కేసులు, అరెస్టులు, నోటీసులు, హౌస్ అరెస్టులతో విరుచుకుపడింది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల తీర్పు బ్యాలెట్ బాక్సు దాకా చేరకూడదన్నదే ఈ దౌర్జన్యకాండ వెనుక అసలు లక్ష్యమని స్పష్టమవుతోంది.
హామీల మోసమే ఈ భయానికి మూలం
ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అంటూ ఊరూవాడా ఊదరగొట్టిన చంద్రబాబు అండ్ కో.. అధికారంలోకి వచ్చాక ఆ హామీలను బుట్టదాఖలు చేశారు. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకి గట్టి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో సజావుగా ఎన్నికలు జరిగితే మున్సిపల్, జెడ్పీ సహా గ్రామ సర్పంచి పదవులు కూడా దక్కవన్న భయంతోనే ఓటు దాకా రానివ్వకుండా నామినేషన్ దశలోనే ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు చంద్రబాబు అన్ని అడ్డదారులు తొక్కుతున్నారు. ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించి, ఆ నెపాన్ని వైఎస్సార్సీపీ మీదకు నెట్టేయడం, తద్వారా ఎన్నికల ప్రచారంలో హామీల అమలు, పాలన వైఫల్యాలపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించడం కూడా చంద్రబాబు పన్నాగమని విశ్లేషకులు చెబుతున్నారు.
అంచెలంచెలుగా కుట్ర
అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికలను ఏకపక్షం చేసుకునేందుకు కూటమి పెద్దలు పక్కా పథకం రచించారు. దాన్ని దశలవారీగా అమలు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రతిపక్ష నేతలపై రౌడీషీట్లు, ప్రివెంటివ్ బాండ్ల పేరుతో స్టేషన్లకు పిలిపించి సంతకాలు తీసుకున్నారు. అభ్యర్థులపై ఎక్కడెక్కడ కేసులున్నాయో చెప్పకుండా జాప్యం చేస్తున్నారు. 15 రోజులుగా నామినేషన్లకు జతపరచాల్సిన సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. మరోపక్క వైఎస్సార్సీపీ అభ్యర్థులకు బెదిరింపు ఫోన్లు చేస్తున్నారు. పోటీ చేస్తే చంపేస్తామని హెచ్చరిస్తున్నారు.
ఇక శుక్రవారం మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు మొదలవగానే ప్రత్యక్ష దాడులకే దిగారు. నామినేషన్ కేంద్రం వరకు రాకుండా వైఎస్సార్సీపీ అభ్యర్థులు, నాయకులపై దాడులు చేస్తున్నారు. నామినేషన్ కేంద్రానికి చేరితే పత్రాలు చించేస్తున్నారు. అవీ దాటితే రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు తీసుకోవడానికే నిరాకరిస్తున్నారు. ఇప్పుడు చివరి అస్త్రంగా పోలీసులే రంగంలోకి దిగారు. తొలిరోజు పుంగనూరు, రాయచోటిలో మొదలైన దౌర్జన్యం రెండో రోజు కడప, పులివెందుల, తిరుపతి, రాజంపేట, ఆళ్లగడ్డ, పల్నాడు దాకా విస్తరించింది. ఒకే రోజు ఇన్ని చోట్ల ఒకే తరహాలో దాడులు, దౌర్జన్యాలు జరిగాయంటే ఇది యాదృచ్ఛికం కాదన్నది సుస్పష్టం. కరకట్ట క్యాంపు ఆఫీసు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సాగుతున్న వ్యవస్థీకృత దండయాత్రే అని విశ్లేషకులు చెబుతున్నారు.
ఎంపీలకే రక్షణ లేని రాజ్యం
తొలిరోజు నామినేషన్ల ఘట్టంలో లోక్‌సభలో వైఎస్సార్సీపీ పక్షనేత మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డిపై హత్యాయత్నాలు చేసిన టీడీపీ మూకలు.. రెండో రోజు తిరుపతి ఎంపీ గురుమూర్తి చేతిలోంచే నామినేషన్ పత్రాలను లాక్కెళ్లారు. ఒక డీఎస్పీయే ఎంపీ చేతుల్లోని పత్రాలను టీడీపీ నేతలకు అప్పగించారంటే పోలీసులు అధికార పార్టీ కోసం ఎలా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఎదురొడ్డి నిలిచిన ప్రతిపక్షం
ఇన్ని దాడులు, బెదిరింపులు, అరెస్టుల మధ్య కూడా వైఎస్సార్సీపీ శ్రేణులు వెనక్కి తగ్గడంలేదు. టీడీపీ కాలకేయులు దాడులు, దౌర్జన్యాలతో రెచ్చిపోయినా, పోలీసులు వారికి రక్షకులుగా మారి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా వైఎస్సార్సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెనుకంజ వేయడం లేదు. వైఎస్సార్సీపీకి ప్రజల్లో ఉన్న మద్దతుతో ప్రాణాలకు తెగించి పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ మద్దతే కూటమి పెద్దలను కలవరపెడుతోంది. అందుకే దాడుల తీవ్రతను పెంచుతున్నారు. ప్రజలను నానా రకాలుగా మోసం చేస్తూ, ఎన్నికల్లో పోరాడి గెలిచే సత్తా లేని ప్రభుత్వం ఖాకీల అండతో దౌర్జన్యాలకు తెగబడుతోంది.
దాడి టీడీపీది.. కేసులు వైఎస్సార్సీపీపైన
టీడీపీ గూండాలు విచ్చలవిడిగా దాడులు చేస్తుంటే.. కేసులు మాత్రం బాధితులైన వైఎస్సార్సీపీ నేతలపైనే పెడుతున్నారు. పుంగనూరులో దాడికి గురైన ఎంపీ మిథున్రెడ్డిపైనే పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. కడపలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, ఇన్‌ఛార్జి అంజాద్ బాషాను అదుపులోకి తీసుకున్నారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి నోటీసులు ఇచ్చారు.
పల్నాడులో వైఎస్సార్సీపీ అభ్యర్థులంతా ఒకేసారి నామినేషన్లు వేయాలని సిద్ధమవడంతో శుక్రవారం అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేష్‌రెడ్డిలను హౌస్ అరెస్ట్ చేశారు. అభ్యర్థులందరినీ పోలీసులే బలవంతంగా ఎత్తుకెళ్లి దాచేయడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. పోలీసులు చట్టానికి కాకుండా అధికార పార్టీకి కాపలా కాస్తున్నారనడానికి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టమే నిదర్శనంగా కనిపిస్తోంది. నామినేషన్ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు పెట్టాలని హైకోర్టు ఆదేశించినా అటువంటి చర్యలేమీ లేవు.


