నామినేషన్లను అడ్డుకుంటే కఠిన చర్యలు | State Election Commission issues directives for the implementation of High Court orders | Sakshi
Sakshi News home page

నామినేషన్లను అడ్డుకుంటే కఠిన చర్యలు

Oct 18 2026 3:30 AM | Updated on Oct 18 2026 3:30 AM

State Election Commission issues directives for the implementation of High Court orders

కలెక్టర్లకు, ఎస్పీలకు ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు

అభ్యర్థులను అడ్డుకున్నా.. పత్రాలు లాక్కున్నా ఉపేక్షించేది లేదు!

నామినేషన్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత కల్పించాలి

సీసీ కెమెరాల నిఘా తప్పనిసరి.. రికార్డయిన ఫుటేజీని భద్రపరచాలి..

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా తగినంత పోలీసు బందోబస్తు కల్పించాలి

పక్షపాతంతో వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు

హైకోర్టు ఆదేశాల అమలుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు

సాక్షి, అమరావతి/విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులను అడ్డుకున్నా, నామినేషన్‌ పత్రాలను లాక్కున్నా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నామినేషన్ల దాఖలుకు ఆటంకాలు కల్పిస్తున్నారంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అథారిటీలు, జిల్లా ఎస్పీలను ఆదేశించింది. నామినేషన్ల కేంద్రాల వద్ద భద్రతను పటిష్ఠం చేయడంతోపాటు, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసి ఫుటేజీని భద్రపరచాలని స్పష్టం చేసింది. 

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, తమ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని, కొన్ని ప్రాంతాల్లో నామినేషన్‌ పత్రాలను లాక్కుంటున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో 16న జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎన్నికల సంఘం పలు కీలక సూచనలు చేసింది. ఎక్కడా శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకూడదని స్పష్టం చేసింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అవసరమైన చోట అదనపు పోలీసు బలగాలను మోహరించాలని ఆదేశించింది.

నామినేషన్ల కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత
అన్ని నామినేషన్ల దాఖలు కేంద్రాల వద్ద తగినంత భద్రత కల్పించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. నిబంధనల ప్రకారం నామినేషన్లు దాఖలు చేయాలనుకునే అభ్యర్థులందరికీ అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. నామినేషన్ల ప్రక్రియకు ఎవరైనా ఆటంకం కలిగించినా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తినా ఉపేక్షించబోమని హెచ్చరించింది. ఫిర్యాదులపై తీవ్రంగా స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

హైకోర్టు ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు
నామినేషన్ల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించేందుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కూడా కీలక ఆదేశాలు ఇచ్చింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను పరిష్కరిస్తూ, అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే కార్యాలయాల్లో, వాటి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలు న్యాయబద్ధంగా, పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా తగినంత పోలీసు బందోబస్తు కల్పించాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ 16న సర్క్యులర్‌ జారీ చేసింది. అన్ని నామినేషన్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఉండేలా చూడాలని, రికార్డయిన ఫుటేజీని భద్రపరచాలని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణలో శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా చూడాలని హైకోర్టు పేర్కొన్నట్లు ఎన్నికల సంఘం సర్క్యులర్‌లో వివరించింది.

అధికారుల గుర్తింపు కార్డులు తప్పనిసరి
ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు తమ గుర్తింపు కార్డులను స్పష్టంగా కనిపించేలా ధరించాలని హైకోర్టు ఆదేశించింది. పరిశీలకులు లేదా ఇతర అధికారులు గుర్తింపును నిర్ధారించమని కోరినప్పుడు వెంటనే గుర్తింపు కార్డులను చూపించాలని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియలో జవాబుదారీతనం, పారదర్శకత ఉండేలా ఈ సూచనలు అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

పక్షపాత వైఖరికి క్రమశిక్షణా చర్యలు
విధుల్లో నిర్లక్ష్యం వహించినా, పక్షపాత ధోరణితో వ్యవహరించినా సంబంధిత అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. పరిస్థితులను బట్టి బదిలీ, ప్రత్యామ్నాయ నియామకం, సస్పెన్షన్‌ వంటి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. హైకోర్టు ఆదేశాలను ఎలాంటి మినహాయింపులు లేకుండా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అథారిటీలను, ఎస్పీలను ఆదేశించింది. తీసుకున్న చర్యలపై నివేదికను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపాలని స్పష్టం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement