భగ్గుమన్న ఫ్రాన్స్‌  | France is set to be swept by broader, nationwide demonstrations | Sakshi
Sakshi News home page

భగ్గుమన్న ఫ్రాన్స్‌ 

Oct 18 2026 5:25 AM | Updated on Oct 18 2026 5:25 AM

France is set to be swept by broader, nationwide demonstrations

జీవన వ్యయం పెరిగిందంటూ పోరాటం మొదలెట్టిన పౌరులు 

పాఠశాలల్లో వసతుల లేమి సమస్యతో ఉద్యమిస్తున్న విద్యార్థులు 

మెరుగైన వేతనం కోరుతూ కారి్మక సంఘాల నిరసనలు 

వచ్చే ఏడాది జరగబోయే దేశాధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపనున్న ఉద్యమం 

పారిస్‌: పౌరులు, విద్యార్థులు, కార్మికుల నిరసనోద్యమాలతో ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఉద్యమాలు శనివారం తీవ్రరూపం దాల్చాయి. పెరిగిన ఇంధన ధరలు, ఇంటి అద్దెలతో జీవనవ్యయం భారీగా పెరిగిపోయిందంటూ పౌరులు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. పాఠశాలల్లో వసతుల లేమి, నిధుల కేటాయింపులో భారీ కోతలతో విద్యావ్యవస్థ నాశనమవుతోందంటూ వేలాది మంది విద్యార్థులు రహదారులపై ధర్నాలు, ర్యాలీలను ఉధృతంచేశారు. 

ప్రజాసేవలు దారుణంగా తయారయ్యాయని, మెరుగైన వేతనాలు, పెన్షన్‌లు అందించాలని, ధరల ఉరవడికి కళ్లెం వేయాలంటూ కార్మిక సంఘాల సభ్యులు సైతం ఫ్రాన్స్‌ నగరాల వీధుల్లో కదం తొక్కారు. మరికొద్ది నెలల్లో జరగబోయే దేశాధ్యక్ష ఎన్నికల ప్రచారం, గెలుపోటములపై ఈ ఉద్యమం తీవ్ర ప్రభావం చూపనుంది. ఫ్రాన్స్‌లో వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తొలి రౌండ్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాల్లో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాని పక్షంలో రెండో దఫా(రన్‌ఆఫ్‌) ఎన్నికలు నిర్వహించనున్నారు. 

భాష్పవాయుగోళాల ప్రయోగం... 
శనివారం పారిస్‌లో ఉద్యమిస్తున్న ఆందోళకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయుగోళాలు, జలఫిరంగులను ప్రయోగించారు. దీంతో రెచ్చిపోయిన నిరసనకారులు ఒక కారును, వార్తాపేపర్ల కేంద్రాన్ని తగలబెట్టారు. ఫ్రాన్స్‌లో మూడో అతిపెద్ద నగరం లియోన్‌లో ఒక ప్రైవేట్‌ టూరిస్ట్‌ ఆఫీస్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పారిస్‌లోని ‘ది లీ రిపబ్లిక్‌’లోని కార్యాలయాలపై ఆందోళనకారులు టపాకాయలు అంటించి విసిరేశారు. మాస్‌్కలు, హూడీలు ధరించిన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు. 

ముందు జాగ్రత్తగా పోలీసులు పలు నగరాల్లోని మెట్రో సేవలను నిలిపేశారు. సామాజిక అసమానతలు తొలగిపోవాలంటే 2018లో మొదలైన విజయవంతమైన ‘యెల్లో వెస్ట్‌’ఉద్యమం తరహా ఆందోళనలు మళ్లీ ఆరంభంకావాలని సామాజిక మాధ్యమాల్లో పిలుపులు జోరందుకున్నాయి. శనివారం మధ్యాహ్నంనాటికే దేశవ్యాప్తంగా 140 చోట్ల ఆందోళనలు నమోదైనట్లు ఫ్రాన్స్‌ అంతర్గత మంత్రి లారెంట్‌ నూనెజ్‌ తెలిపారు. పారిస్, మార్సెల్లీ, రెన్సీస్, టైలూస్, యాంగర్స్‌ నగరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ స్పందించారు. ‘‘నిరసన తెలపడం రాజ్యాంగబద్ధ హక్కే. కానీ ప్రభుత్వ ఆస్తులు, ప్రజాసేవలు, పౌర ప్రాంతాలను పరిరక్షించాల్సిన బాధ్యత కూడా నిరసనకారులపై ఉంది. ఆస్తుల ధ్వంసం ఏమాత్రం సబబుకాదు’’అని బ్రస్సెల్స్‌లో ఆయన అన్నారు. గత కొన్ని నెలలుగా దేశంలో జరుగుతున్న నిరసనల్లో వేలాదిమందిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement