
న్యూఢిల్లీ: దేశరాజధాని డిల్లీలో పంద్రాగస్టు వేడుకలకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో మరో ఘోరం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న యువతిపై నలుగురు యవకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పైగా ఈ దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని బాధితురాలిని వారు బెదిరించారు.
వివరాల్లోకి వెళితే ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఒక పార్టీలో 24 ఏళ్ల యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేసేందుకు, వారి కోసం గాలింపు కొనసాగుతున్నదన్నారు. ఆ నలుగురు నిందితులు బాధితురాలిని వాష్‌రూమ్‌లోనికి లాకెళ్లి, సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. గురుగ్రామ్‌లోని ఒక సంస్థలో పనిచేస్తున్న బాధితురాలు తాను పార్టీలో మద్యం సేవించిన తర్వాత నలుగురు యువకులు తనపై అత్యాచారం జరిపారని ఆరోపించారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
తన స్నేహితుడు తనను సివిల్ లైన్స్‌లోని మరో స్నేహితుని ఇంటికి పార్టీకి ఆహ్వానించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అక్కడ ఆమె తన స్నేహితురాలు, మరొక పరిచయస్తుడు, మరో ఇద్దరు యువకులను కలుసుకుంది. వారంతా మద్యం సేవించి, అర్థరాత్రి వరకు పార్టీ చేసుకున్నారు. ఆ తరువాత ఆమె స్పృహ కోల్పోయింది. తరువాత నలుగురు యువకులు ఆమెను వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి, సామూహిక అత్యాచారం చేశారు. అలాగే దీనిని వీడియో తీశారు.
ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని బాధితురాలిని వారు బెదిరించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత ఆ యువకులు ఆమెను.. ఆమె ఇంటి బయట దింపి వెళ్లిపోయారు. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫోన్ చేసి, జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. ఒక మహిళా అధికారి ఆమెను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారని పోలీసులు తెలిపారు. తరువాత బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించామని, ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారని పోలీసులు వివరించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.