సాక్షి, ఢిల్లీ: సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నోయిడా నిఠారీ వరుస హత్యల కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు సురేంద్ర కొలిని మంగళవారం నిర్దోషిగా ప్రకటించింది. ‘‘నిందితుడిపై నేరారోపణలు రుజువు కాలేదు. కాబట్టి నిర్దోషిగా విడుదల చేస్తున్నాం’’ అని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఆఖరి కేసులో కూడా నిర్దోషిగా తేలడంతో సురేంద్ర దాదాపు 19 ఏళ్ల తర్వాత విడుదల కానున్నాడు.
ఏంటీ కేసు..
నోయిడా సమీపంలోని నిఠారీ గ్రామంలో 2005-06 మధ్యకాలంలో.. చిన్నారులు, యువతులు అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. ఫిర్యాదులను మొదట్లో పోలీసులు తేలికగా తీసుకున్నా.. బాధితుల సంఖ్య పెరుగుతూ పోవడం, మీడియా కథనాల దృష్ట్యా తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేపట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో.. 2006 డిసెంబర్ 29న ఘోరం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ ఇంటి వెనుక ఉన్న మురికి కాలువలో ఎనిమిది మంది చిన్నారుల అస్థిపంజరాలు బయటపడ్డాయి. దీంతో ఈ కేసు దేశం దృష్టిని ఆకర్షించింది.
ఎవరీ సురేంద్ర?
అస్థిపంజరాలు బయటపడ్డ డ్రెయిన్‌ను ఆనుకుని వ్యాపారవేత్త అయిన మోనిందర్ సింగ్ పాంధేర్ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో పని చేసే సురేంద్ర కోలిని ప్రధాన అనుమానితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేసు తీవ్రత దృష్ట్యా సీబీఐ చేతికి వెళ్లింది. 2007 నుంచి మూడేళ్ల పాటు విచారణ జరగ్గా.. మోనిందర్‌తో పాటు సురేంద్ర కోలిని నిందితులుగా పేర్కొంది. చాక్లెట్లు చూపించి చిన్నపిల్లలను సురేంద్ర రప్పించేవాడని, మోనిందర్‌తో కలిసి హత్యాచారం చేసేవాడని అభియోగం నమోదు చేసింది. నరమాంసం భక్షణ, ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం(అస్థిపంజరాలను కాలువలో పడేయడం) లాంటి అభియోగాలను కూడా పేర్కొంది.
విచారణ జరిపిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కోలికి, పాంధేర్‌కి మరణశిక్ష విధించింది. రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం ఈ ఇద్దరూ ప్రయత్నించగా.. తిరస్కారం ఎదురైంది. కోలిపై 15 ఏళ్ల బాలిక హత్య కేసులో దోషిగా తీర్పు ఇచ్చి మరణశిక్షను ధృవీకరించింది. అయితే 2023లో అలహాబాద్ హైకోర్టు కోలిని 12 కేసుల్లో, పాంధేర్‌ని 2 కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో అదే ఏడాది అక్టోబర్‌లో పాంధేర్ జైలు నుంచి విడుదలయ్యాడు.
అయితే సీబీఐతో పాటు బాధిత కుటుంబాలు ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఆ అప్పీల్‌ను తిరస్కరిస్తూ ఈ ఏడాది జులై 31వ తేదీన అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. మరోవైపు సుప్రీం కోర్టు విధించిన మరణశిక్ష రద్దు కోసం(15 ఏళ్ల బాలిక కేసులో) కోలి కరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరగ్గా.. ఆధారాల లోపం, విచారణలో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ ఇవాళ సీజేఐ బెంచ్ నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదలకు ఆదేశించింది.


