
చెన్నై: కల్తీ దగ్గు మందు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 మంది చిన్నారుల మరణాలకు కారణంగా భావిస్తున్న కోల్డ్రిఫ్ సిరప్ తయారు చేసిన శ్రేసన్ ఫార్మాసూటికల్స్ కంపెనీ యాజమాని జి.రంగనాథన్(73)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
జి. రంగనాథన్(G Ranganathan) మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి ఫార్మసీ గ్రాడ్యుయేట్. గత 40 ఏళ్లుగా ఔషధ తయారీ రంగంలో ఉన్నారు. 80వ దశకంలో ప్రోనిట్(Pronit) అనే పోషక సిరప్‌ను తయారు చేసి చెన్నైలో ప్రసిద్ధి పొందారు. ఆ తర్వాత లిక్విడ్ నాసల్ ప్రొడక్ట్స్(ముక్కు డ్రాప్స్), చిన్న స్థాయి తయారీ యూనిట్లను చెన్నై పరిసరాల్లో స్థాపించారు. శ్రేసన్‌తో పాటు సీగో ల్యాబస్, ఇవెన్ హెల్త్‌కేర్ సంస్థలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా పలు ఔషధ సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. ఎందరో యువ పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశకుడిగా నిలిచారు కూడా.
అయితే మధ్యప్రదేశ్ చిన్నారుల మరణాల నేపథ్యంలో.. శ్రేసన్ సంస్థపై కేసు నమోదు అయ్యింది. కోడంబాక్కంలోని రంగనాథన్ కార్యాలయాన్ని సైతం అధికారులు సీజ్ చేశారు. ఆయన అరెస్టును పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. ఇదిలా ఉంటే..

తమిళనాడు కాంచీపురం శ్రేసన్ ఫార్మాసూటికల్స్ యూనిట్ నుంచి మే నెలలో కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ (Cough Syrup) బ్యాచ్‌ను పలు రాష్ట్రాలకు పంపింది. ఈ క్రమంలో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య కాలంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కలిపి 20 మంది చిన్నారులు మరణించారు. ఈ నేపథ్యంలో కోల్డ్‌రిఫ్‌ను నిషేధించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. మరణాలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఏర్పాటు చేసింది. పలువురు అధికారులపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది. అయితే..
కోల్డ్‌రిఫ్‌లో డైఈథిలీన్ గ్లైకాల్ (DEG) అనే పదార్థం మోతాదుకు మించి(500 రేట్లు) 48.6% స్థాయిలో ఉన్నట్లు ల్యాబ్ పరీక్షల్లో తేలింది. ఇదే పిల్లల్లో కిడ్నీలను కరాబు చేసి.. వాళ్ల మరణాలకు దారి తీసింది. తమిళనాడు ప్రభుత్వ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్‌ట్‌మెంట్ తనిఖీల అనంతరం తీవ్ర ఉల్లంఘనలను గుర్తించి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న శ్రేసన్ యూనిట్‌ను మూసేసింది. 2011లో ఏర్పాటైన ఈ యూనిట్.. ఆ తర్వాతి కాలంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోలేదు. అలాగే అక్కడి అపరిశ్రుభ వాతావరణం, నిబంధనలకు పాటించకుండా కెమికల్స్ కొనుగోలు నేపథ్యంతో ఉత్పత్తి లైసెన్స్‌నూ రద్దు చేసింది. ఈ క్రమంలో క్రిమినల్ కేసు నమోదైనట్లు సమాచారం.
ఇదీ చదవండి: కోల్డ్రిఫ్.. తయారీ.. యాక్ ఛీ!