
మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ‘కోల్డ్‌రిఫ్’ అనే దగ్గు మందు వాడడం వల్ల పలువురు చిన్నారులు మృత్యువాత పడడంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా.. ఎడపెడా పిల్లలకు దగ్గు, జలుబు సిరప్‌లు వాడొద్దంటూ సూచనలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. కోల్డ్‌రిఫ్ కేసులో ఇప్పుడు సంచలన విషయం ఒకటి బయటపడింది.
చిన్నారుల మరణాలు, అస్వస్థత నేపథ్యంలో మధ్యప్రదేశ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ యూనిట్‌ను అప్రమత్తం చేసింది. ఆ విభాగం కాంచీపురంలోని కోల్డ్‌రిఫ్ దగ్గు మందు(Coldrif Syrup) తయారైన శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్‌లో(Sresan Pharmaceuticals) అక్టోబర్ 1, 2 తేదీల్లో తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో 16 మంది చిన్నారుల మరణానికి కారణంగా భావిస్తున్న కోల్డ్‌రిఫ్ తయారీని చూసి అధికారులు సైతం విస్తోపోయారట!.
ఎన్డీటీవీ ఇచ్చిన కథనం ప్రకారం.. తయారీ కేంద్రంలో కనిపించిన దృశ్యాలు ఇలా ఉన్నాయి. ఆ యూనిట్‌లో గ్యాస్ స్టవ్‌లపైనే రసాయనాలను వేడి చేస్తున్నారు. తుప్పుపట్టిన పరికరాలు, మురికి పట్టిన పైపులు. గ్లౌజులు, మాస్కులు లేకుండా సిబ్బంది పదార్థాలను మిక్స్ చేస్తున్నారు. మరో దారుణమైన విషయం ఏంటంటే.. అక్కడున్న కార్మికుల్లో దాదాపుగా అనుభవం లేనివారే ఉన్నారు. వీటికి తోడు..

స్వచ్ఛత పరీక్షలు జరపకుండానే సిరప్‌ల కోసం నీటిని ఉపయోగిస్తున్నారు. ఎయిర్ ఫిల్టర్లు, హెచ్‌ఈపీఏ(HEPA) వ్యవస్థ(అత్యంత సూక్ష్మ ధూళి, బ్యాక్టీరియా, వైరస్‌ను 99.97% వరకు తొలగించగలిగే శుద్ధి వ్యవస్థ)లు లేకపోవడం అధికారులను ఆశ్చర్యపరిచిందట.
అలాగే.. చెన్నైలోని రెండు ప్రముఖ కంపెనీల నుంచి కెమికల్స్‌ను నగదు రహిత లావాదేవీల ద్వారా ఇండస్ట్రీయల గ్రేడ్ కెమికల్స్ కొనుగోలు చేసినట్లు తేలింది. ప్రొపైలీన్ గ్లైకోల్ లాంటి కీలక పదార్థాన్ని ఫార్మాస్యూటికల్ ప్రమాణాలు లేని పెయింట్ పరిశ్రమ డీలర్ల నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. అన్నింటికి మించి.. డైఈథిలీన్ గ్లైకాల్(Diethylene glycol)ను టెస్టింగ్ ప్రక్రియతో సంబంధం లేకుండా సిరప్‌లలో కలిపారు.
SR-13 డేంజర్ బ్యాచ్..
కోల్డ్‌రిఫ్ కఫ్ సిరప్.. SR-13 బ్యాచ్ ఈ యూనిట్‌లోనే ఈ ఏడాదిలోనే తయారయ్యాయి. రెండేళ్ల కాలపరిమితితో ఈ సిరప్‌లు.. మే నెలలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, పుదుచ్చేరి మార్కెట్‌లోకి వెళ్లాయి. అయితే.. ఇందులో డైఈథిలీన్ గ్లైకాల్ 48.6% ఉన్నట్లు బయోప్సీ నివేదికలు వెల్లడించాయి. ఇది అనుమతించిన పరిమితికి 500 రెట్లు ఎక్కువ. ఈ పదార్థం.. కిడ్నీ, కాలేయం, నర్వస్ సిస్టమ్ మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఈ కారణంగానే ఆగస్టు–సెప్టెంబర్ మధ్య చింద్వారా జిల్లాలో చిన్నారులు మరణించారని తెలుస్తోంది.

ఫార్మాకోవిజిలెన్స్ లేకపోవడం, అనుభవం లేని సిబ్బంది, నీటి స్వచ్ఛత పరీక్షలు లేకపోవడం, వెంటిలేషన్,, పెస్ట్‌కంట్రోల్ లేకపోవడం.. ఇలా డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ 1940 ప్రకారం శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్ 39 క్రిటికల్, 325 మేజర్ ఉల్లంఘనకు పాల్పడింది.
ఈ ఘటనపై దర్యాప్తునకు సిట్‌ఏర్పాటు చేసింది మధ్య ప్రదేశ్ ప్రభుత్వం, మరోవైపు.. శ్రేసన్ కంపెనీ స్టాప్ ప్రొడక్షన్ ఆర్డర్, స్టాక్ ఫ్రీజ్, లైసెన్స్ సస్పెన్షన్ విధించారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం: ఇద్దరు డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్ సస్పెండ్ చేసింది. డ్రగ్ కంట్రోలర్ దినేష్ మౌర్యను ట్రాన్స్‌ఫర్ చేసింది. సిరప్‌ను రిఫర్ చేసి ఇద్దరు పిల్లల మరణానికి కారణం అయ్యాడంటూ ఓ డాక్టర్‌ను అరెస్ట్ చేసింది. అయితే.. ఇది కేవలం ఆ సంస్థ నిర్లక్ష్య ధోరణి మాత్రమే కాదు.. రసాయనాల కొనుగోలు నుంచి, తయారీ, పంపిణీ వరకు మొత్తం వ్యవస్థ వైఫల్యం అని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు ఎన్‌డీటీవీ వద్ద వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: సిరప్‌తో చనిపోతే.. డాక్టర్ తప్పెలా అవుతుంది?