
దగ్గు సిరప్ తాగి చిన్నారులు (Cough Syrup Deaths) చనిపోవడం.. దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన కథనాల నేపథ్యంతో పిల్లలకు దగ్గు మందు వాడే విషయంలో తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో.. శని, ఆదివారాల్లో కీలక పరిణామలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ప్రభుత్వ వైద్యుడ్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. అలాగే మరణాలకు కారణంగా భావిస్తున్న సిరప్ ఉత్పత్తిదారుపైనా కేసు నమోదు అయ్యింది.
మధ్యప్రదేశ్ ఛింద్వారా జిల్లాలో పలువురు చిన్నారులు కోల్డ్రిఫ్ (ColdriF) అనే దగ్గు సిరప్ తీసుకున్న కారణంగా చనిపోయారు. ఇటు రాజస్థాన్‌లోనూ మూడు మరణాలు సంభవించాయి. ఈ ఘటనల నేపథ్యంలో బేతుల్ జిల్లాలో పేరెంట్స్‌కు ఈ సిరప్‌ను ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ ప్రవీణ్ సోనీని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా.. ఇక్కడే ఇద్దరు చిన్నారులు(ఒకరు నాలుగన్నరేళ్లు, ఒకరు రెండున్నరేళ్లు) సిరప్ కారణంగానే మరణించినట్లు సమాచారం అందుతోంది. వీరిద్దరూ ప్రవీణ్ వద్దే వైద్యం తీసుకోవడం గమనార్హం.
దీంతో దేశవ్యాప్తంగా దగ్గు సిరప్ మరణాల సంఖ్య 14కి చేరినట్లయ్యింది. సిరప్ తీసుకున్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. తీవ్ర జ్వరం, పొట్ట ఉబ్బిపోయి.. మూత్రపిండాలు(కిడ్నీ) ఫెయిల్ అయ్యి మరణిస్తున్నారు. ఈ తరహా లక్షణాలతో ఎనిమిది మంది చిన్నారులు నాగ్‌పూర్, భోపాల్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అక్కడి అధికారులు వెల్లడించారు. మరోవైపు చిన్నారుల ‘సిరప్’ మరణాలపై దర్యాప్తునకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(SIT)ను ఏర్పాటు చేసింది.
వరుస మరణాల నేపథ్యంలో.. చిన్నారులు వాడిన 19 రకాల మందుల శాంపిళ్లను సేకరించి పరీక్షించగా, 'కోల్డ్రిఫ్' అనే దగ్గు సిరప్‌లో(బాచ్ నంబర్ SR-13) డైఇథైలిన్ గ్లైకాల్ (DEG-48.6%) అనే ప్రమాదకర రసాయనం పరిమితికి మించి ఉన్నట్లు తేలింది. తమిళనాడు డ్రగ్ కంట్రోల్ అథారిటీ అక్టోబర్ 2న వెల్లడించిన నివేదికలోనూ ఈ విషయం నిర్ధారణ అయ్యింది. దీంతో కోల్డ్రిఫ్ (ColdriF) సిరప్‌పై మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నివేదిక తర్వాత.. మధ్యప్రదేశ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రవ్యాప్తంగా ColdriF స్టాక్‌లను నిషేధించి స్వాధీనం చేసుకుంది. రాజస్థాన్‌లో కూడా ఇలాంటి మరణాలు సంభవించడంతో తమిళనాడు ప్రభుత్వం ఈ ఉత్పత్తిని ఆపేయించింది.
ఇక.. తనిఖీల అనంతరం, ఆ తయారీ యూనిట్ లైసెన్సును రద్దు చేయాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) సిఫార్సు చేసింది. అంతేకాకుండా, సంబంధిత కంపెనీపై క్రిమినల్ చర్యలు కూడా ప్రారంభించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అరెస్టైన డాక్టర్ ప్రవీణ్ సోనీతో పాటు తయారుదారీ కంపెనీ స్రేసన్ ఫార్మాస్యూటికల్స్ పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105 (హత్యకు సమానమైన నిర్లక్ష్యంతో మృతికి కారణం), సెక్షన్ 276 (మందుల కల్తీ), మరియు డ్రగ్స్ & కాస్మెటిక్స్ చట్టంలోని సెక్షన్ 27A ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ కేసులు జీవిత ఖైదు శిక్షకు దారి తీసే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా పిల్లలకు వాడే దగ్గు మందుల నాణ్యత, వినియోగంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పిల్లలకు దగ్గు మందులను విచక్షణారహితంగా వాడొద్దని పేరెంట్స్‌కు, అలాగే ఈ విషయంలో కఠిన నిబంధనలు పాటించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. చాలా వరకు దగ్గులు వాటంతట అవే తగ్గిపోతాయని, వాటికి మందులు అవసరం లేదని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా, ఔషధ తయారీ కంపెనీలన్నీ సవరించిన షెడ్యూల్ 'ఎం' నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆరోగ్య కార్యదర్శి నొక్కిచెప్పారు. పిల్లల విషయంలో దగ్గు మందుల వాడకాన్ని తగ్గించేలా చూడాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు సూచించారు. ఆరోగ్యానికి సంబంధించిన అసాధారణ సంఘటనలపై నిఘా పెంచాలని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి సకాలంలో నివేదికలు తెప్పించుకోవాలని ఆదేశించారు.
మరోవైపు.. డాక్టర్ ప్రవీణ్ సోనీని తక్షణమే విడుదల చేసి.. ఆయనపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని, లేకంఉటే నిరవధిక సమ్మె చేపడతామని చింద్వారా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది.
ఇంకోవైపు.. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది మధ్య ప్రదేశ్ ప్రభుత్వం. అయితే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు.. ఆరోగ్య సంక్షోభ వేళ సీఎం మోహన్ యాదవ్ తన కుటుంబంతో కలిసి అస్సాంకు జాలీగా ట్రిప్‌కు వెళ్లడం విమర్శలకు తావిచ్చింది.
దగ్గుమందులు, యాంటీబయటిక్స్ ‘కల్తీ’ విషయంలో సీడీఎస్‌సీవో సమీక్ష చేపట్టింది. ఈ క్రమంలో.. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌తో పాటు తమిళనాడు, యూపీ, కేరళ, మహారాష్ట్రలోనూ 19 ఔషధ తయారీ సంస్థలపై తనిఖీలు ప్రారంభించింది.