
ప్రకృతి పరిరక్షణ మన ధర్మమే. ఇది మన భవిష్యత్ తరాలకు సుస్థిర జీవన ప్రమాణాల పునాది. కాబట్టి, ప్రకృతితో ఐక్యం అనేది మానవ వికాసానికి మార్గదర్శకమైన తత్త్వం. ఇస్రో–నాసా సంయుక్తంగా రూపొందించిన ‘నిసార్’ మిషన్ ఈ తత్త్వాన్ని భవిష్యత్ తరం వరకు నిలిపే సంకేతమే! భూమి, పర్యావరణ మార్పులను కచ్చితంగా గుర్తించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ ఉపగ్రహ ప్రయోగం జూలై 30న జరగనుంది. ఇది ప్రపంచంలోనే తొలి డ్యూయల్–ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్ శాటిలైట్ కావడం విశేషం.
నిసార్ శాటిలైట్ (NISAR satellite) 2,393 కిలోల బరువుతో, భూమి నుంచి 743 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ తిరుగనున్నది. ఇది ప్రతి 12 రోజులకు భూమిని క్షుణంగా పరిశీలించి అత్యంత కచ్చితత్వంతో; అధిక నాణ్యత, స్పష్టతలతో కూడిన ఛాయ చిత్రాలనూ, సమాచారాన్నీ ఆందిస్తుంది. ఇందులో నాసా (NASA) అభివృద్ధి చేసిన ఎల్–బ్యాండ్ ఎస్‌ఏఆర్, ఇస్రో (ISRO) రూపొందించిన ఎస్–బ్యాండ్ రాడార్లను కలిపిన డ్యూయల్ ఎస్‌ఏఆర్ సాంకేతికత ఉంది. ఇది పగలు, రాత్రి, వర్షం, పొగ, మేఘాలు వంటి ఏ పరిస్థితిలోనైనా స్పష్టమైన హై రిజల్యూషన్ డేటాను సేకరించగలదు.
ఈ ఉపగ్రహం ద్వారా భూకంపాలు, అగ్నిపర్వతాలు, కొండల కదలికలు, మంచు కరుగు దల, నేలలో తేమ సాంద్రత, అటవీ విస్తీర్ణ మార్పులు వంటి అంశాలను విశ్లేషించవచ్చు. ఈ సమాచారాన్ని విపత్తు నిర్వహణ, వ్యవసాయ, అటవీ సంరక్షణ, పర్యవేక్షణల కోసం వినియోగించవచ్చు. ‘నీటి అడుగున ఉన్న భూభాగాన్ని మ్యాప్ చేయటం నిసార్ మిషన్‌లో ఒక ముఖ్యమైన అంశం. ఇది సముద్ర శాస్త్రం, రక్షణ, చేపలు వంటి రంగాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తీరప్రాంత మార్పులు... అంటే కోస్తా నేలల క్షీణత వంటి విషయాల్లో ముందస్తు సమాచారం అందించగలదు.
చదవండి: ప్రళయ్ క్షిపణి ప్రయోగం విజయవంతం
నిసార్ రోజుకు సుమారు 4,300 గిగాబైట్ల హై రిజల్యూషన్ డేటా సేకరిస్తుంది. ఈ డేటా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే 80కి పైగా సంస్థలు ఈ డేటాను వినియోగించేందుకు ఒప్పందం చేసుకున్నాయి. నిసార్... నాసా– ఇస్రో సాంకేతిక భాగస్వామ్యానికి ఒక కొత్త మైలురాయి. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు, సహాయక సంస్థలకు ఇది అమూల్య సమాచార వనరుగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం సుమారు రూ. 12,500 కోట్లు, ఇందులో భారత్ వాటా రూ. 1,000 కోట్లు కావడం గమనార్హం.
– వాడవల్లి శ్రీధర్, హైదరాబాద్