
లక్నో: ఎ ఫర్ అఖిలేష్ యాదవ్, డి ఫర్ డింపుల్ యాదవ్, ఎం ఫర్ ముంలాయం సింగ్ యాదవ్.. ఇది ఇప్పుడు యూపీలో సమాజ్‌వాదీ పార్టీ పీడీఏ పాఠశాలను ఏర్పాటు చేస్తూ పీల్లలకు నేర్పుతున్న ప్రాథమిక పాఠం.
సాధారణంగా చిన్న పిల్లలకు ఇంగ్లిష్‌ను పరిచయం చేసే క్రమంలో ఎ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సీ ఫర్ క్యాట్, డీ ఫర్ డాగ్ అని పరిచయం చేస్తారు. మరి యూపీలోని పీడీఏ పాఠశాలల్లో ఎ ఫర్ అఖిలేష్ అనే మాట వినిపిస్తోంది.
యూపీలోని సమాజ్‌వాది పీడీఏ పాఠశాలలను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టింది. పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సూచన మేరకు పీడీఏ పాఠశాలలను ప్రారంభిస్తోంది. దీనిలో భాగంగా యూపీలో సహరాన్ పూర్ జిల్లాలోని రామ్‌నగర్‌లో తాజాగా పీడీఏ స్కూల్‌ను ఓపెన్ చేశారు. ఎక్కడైతే గవర్నమెంట్ స్కూళ్లు మూసివేయబడుతున్నాయో అక్కడ పీడీపీ స్కూళ్లు ఓపెన్ చేయాలనే అఖిలేష్ ఆదేశాల నేపథ్యంలో పార్టీ కార్యకర్త ఫరాజ్ అలామ్ గడా ఈ స్కూల్‌ను ఆరంభించారు. ఈ స్కూల్‌లో 60 మందికి పైగా విద్యార్థులు చేరారు. ఇప్పుడు అక్కడ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నేతల పేర్లను ఇంగ్లిష్ వర్ణమాలకు ఉపయోగిస్తూ పాఠాలు బోధిస్తున్నారు.
దీనిపై ఫరాజ్ మాట్లాడుతూ.. దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీల కోసం ఈ స్కూళ్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తొలుత ఈ స్కూల్‌లో 25 మంది చేరగా, ఆపై ఆ సంఖ్య 60పైకి చేరిందన్నారు.
‘ఇది స్కూల్ కాదు.. ఒక ఉద్యమం. బీజేపీ గవర్నమెంట్ స్కూళ్లను మూసివేస్తోంది. పేద పిల్లలు చదువుకోవడానికి వీలు లేకుండా చేస్తోంది. మా పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖేలేష్ యాదవ్ దీనిపై దృష్టి సారించారు. ఎక్కడైతే స్కూల్ మూతబడుతుందో అక్కడ పీడీఏ స్కూల్ ఏర్పాటు కావాలని ఆదేశించారు. ఈ స్కూల్‌లో పిల్లలకు బేసిక్ ఎడ్యుకేషన్‌ను అందివ్వడంతో పాటు మా పార్టీ రాజకీయ సందేశాన్ని కూడా ఇక్కడ జోడిస్తున్నాము. ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగానే ఉంటుంది. మా నాయకులు గురించి కూడా పాఠాల ద్వారా చెప్పే యత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఎ అంటే అఖిలేష్, డి అంటే డింపుల్ యాదవ్(అఖిలేష్ యాదవ్ భార్య), ఎం అంటే ములాయింగ్ సింగ్ యాదవ్( మా పార్టీ వ్యవస్థాపకుడు)ల గురించి కూడా చెబుతున్నాం’ అని పార్టీ కార్యకర్త తెలిపారు.
ప్రతీ గ్రామంలో పీడీఏ పాఠశాల..
గతవారం బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు అఖిలేష్ యాదవ్ స్కూళ్లు పెయిరింగ్ పాలసీలో భాగంగా చాలా చోట్ల గవర్నమెంట్ స్కూళ్లను యోగి సర్కార్ మూసివేస్తుందంటూ మండిపడ్డారు. గవర్నమెంట్ స్కూల్ ఎక్కడైతే మూతబడుతుందో ఆ గ్రామంలో కచ్చితంగా పీడీఏ స్కూల్ ఓపెన్ చేస్తాం. ప్రతీ గ్రామంలోనూ పీడీఏ స్కూల్ వస్తుంది. రాష్ట్రంలోనే విద్యా వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోంది. రాజకీయ వనరులను విస్తరిస్తున్న యోగి సర్కార్.. విద్యా వ్యవస్థను పట్టించుకోవడం లేదు’ అని అఖిలేష్ ధ్వజమెత్తారు.