
రాంచీ: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పటికే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేయగా, ఇప్పుడు ఆ జాబితాలో జార్ఖండ్ రాష్ట్ర బీజేపీ ఎంపీ నిక్షికాంత్ దుబే చేరిపోయారు. సుప్రీం తీర్పు ‘అరాచకం’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ.. ఇక తాము పార్లమెంట్ ను, అసెంబ్లీలను కూడా మూసేస్తాం అంటూ సెటైర్లు వేశారు. ప్రధానంగా రాష్ట్రపతికి మూడు నెలల టైమ్ లైన్ విధించడాన్ని ఆక్షేపించారు సదరు ఎంపీ.
నియామక అధికారికి మీరు ఎలా దిశానిర్దేశం చేస్తారు?, రాష్ట్రపతి అనేవారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను నియమిస్తారు. పార్లమెంట్ అనేది ఈ దేశంలో చట్టాలు తయారు చేస్తుంది. అప్పుడు మీరు పార్లమెంట్ ను ఎలా డిక్టేట్ చేస్తారు. మీరు కొత్త చట్టాన్ని ఎలా రూపొందించారు. ఏ చట్టంలో రాష్ట్రపతి మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఉంది? అంటే మీరు ఈ దేశాన్ని అరాచకం వైపు తీసుకెళ్లాలనుకుంటున్నారా?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై పార్లమెంట్ లో సమగ్ర చర్చ జరగాల్సిందేనని దూబే పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయవ్యవస్థ పరిమితులపై ప్రశ్నలను లెవనెత్తింది’ అంటూ వ్యాఖ్యానించారు.
ఇటీవల ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరించవద్దని. ప్రజాస్వామ్య వ్యవస్థలపై సుప్రీంకోర్టు అణు క్షిపణి ప్రయోగించాలనుకోవడం సమంజసం కాదన్నారు. పరిశీలన కోసం రాష్ట్ర గవర్నర్లు పంపించిన బిల్లులపై నిర్ణయం తీసుకొనే విషయంలో రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం పట్ల జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.ఇది నిజంగా ఆందోళనకరమని అన్నారు. ఇలాంటి పరిణామం కోసం మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదన్నారు.
ఇవీ చదవండి: