కేంద్రంపై సుప్రీంకోర్టు మండిపాటు
గడువు ఇచ్చినా అమలు చేయలేదంటూ అసహనం
ఆదేశాల అమలు ఫైళ్లను సమర్పించాలని ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) క్యాడర్ రివ్యూ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 2025లో ఇచ్చిన తీర్పును ఇప్పటికీ అమలు చేయకుండా తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తోందని దాఖలైన ధిక్కార పిటిషన్‌పై జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆరు నెలల్లోగా రివ్యూ పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశా లు ఉన్నప్పటికీ గడువు ముగిసిన తర్వాత ప్రక్రియను ప్రారంభించడమేంటని ప్రశ్నించింది. తీర్పు అమలుకు తీసుకున్న చర్యలకు సంబంధించిన అన్ని పత్రాలను తమ ముందు ఉంచాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఆ చట్టం రక్షణ కవచం కాదు
2025 మే 23న సంజయ్ ప్రకాశ్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2019 జూలై 12నాటి డీవోపీటీ మెమోరాండం ప్రకారం సీఏపీఎఫ్‌ను ఆర్గనైజ్డ్ గ్రూప్–ఎ సర్వీసెస్‌గా గుర్తిస్తూ నిబంధనలను సవరించాలని, 6 నెలల్లోగా క్యాడర్ రివ్యూ చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది. సీఏపీఎఫ్లోకి ఐపీఎస్ అధికారుల డెప్యూటేషన్‌ను దశలవారీగా నిలిపివేయాలని కూడా పేర్కొంది. అయితే ఈ తీర్పు అమలుకు నోచుకోక పోవడంతో పలు ధిక్కార పిటిషన్లు దాఖలయ్యాయి.
ఇదే సమయంలో సుప్రీం తీర్పును అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ’సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్) చట్టం–2026’ను తీసుకువచ్చింది. ఈ చట్టాన్ని అక్టోబర్ 8న నోటిఫై చేసింది. కొత్తగా తీసుకొచ్చిన చట్టం పేరుతో క్యాడర్ రివ్యూ చేయకపోవడాన్ని సమర్థించుకోలేరని ఐటీబీపీ, బీఎస్ఎఫ్ అధికారుల తరఫు సీనియర్ న్యాయవాదులు అరవింద్ దాతార్, గురు కృష్ణకుమార్ వాదించారు. చట్టం తీసుకొచ్చినంత మాత్రాన సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి రక్షణ కవచం లభించదన్నారు.
తీర్పు తర్వాత 61 మందికి డెప్యూటేషన్
పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపిస్తూ సీఏపీఎఫ్ క్యాడర్ రివ్యూ 2021 నుంచి పెండింగ్‌లో ఉందని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారమే తీర్పు వెలువడిన తర్వాత ఏకంగా 61 మంది ఐపీఎస్ అధికారులను సీఏపీఎఫ్లోకి డెప్యూటేషన్‌పై తీసుకున్నారని వివరించారు. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన అక్టోబర్ 8వ తేదీ వరకు కేంద్రం వద్ద ఎలాంటి చట్టపరమైన రక్షణ లేదని, కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే అమలు చేయలేదని వాదించారు.
సుప్రీం తీర్పుపై కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ 2025 అక్టోబర్ 28న తిరస్కరణకు గురైందని వారు గుర్తుచేశారు. ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ 2026 మార్చిలో 18–20 నెలల గడువు పొడిగింపు కోరుతూ కేంద్రం దరఖాస్తు చేయడాన్ని తప్పుపట్టారు. చట్టసభల ద్వారా తీర్పును అధిగమించేందుకు చేసిన ప్రయత్నం చెల్లదని వారు స్పష్టం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేసు తదుపరి విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది. 2025 మే 23 నాటి తీర్పు అమలు కోసం తీసుకున్న చర్యలు, అందుకు సంబంధించిన పూర్తి ఫైళ్లను ఆలోగా తమ ముందుంచాలని కేంద్రాన్ని ఆదేశించింది.
గడువు ముగిశాక లేఖలా?
తీర్పు వెలువడిన ఆరు నెలల గడువు ముగిసిన తర్వాత కేంద్రం క్యాడర్ రివ్యూ చేపట్టడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. 2025 డిసెంబర్ 26న, 2026 ఫిబ్రవరి 3న క్యాడర్ రివ్యూ ప్రతిపాదనల కోసం హోం శాఖ సీఏపీఎఫ్‌లకు లేఖలు రాయడాన్ని గుర్తించింది. ఆదేశాల ఉల్లంఘన జరుగుతోందన్న విషయాన్ని బలగాలకు ముందుగా తెలియజేశారా? అని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని ధర్మాసనం ప్రశ్నించింది. 2026 ఏప్రిల్, మే, జూలై నెలల్లో సంబంధిత మంత్రిత్వ శాఖల నుంచి ప్రతిపాదనలు రావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది.


