రాష్ట్రపతిని కోర్టులు ఆదేశించలేవు | Vice President no holds barred attack on Supreme Court | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతిని కోర్టులు ఆదేశించలేవు

Apr 18 2025 4:45 AM | Updated on Apr 18 2025 6:15 AM

Vice President no holds barred attack on Supreme Court

సుప్రీంకోర్టు సూపర్‌ పార్లమెంట్‌గా వ్యవహరించొద్దు

ఉప రాష్ట్రపతి ధన్‌ఖడ్‌ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు సూపర్‌ పార్లమెంట్‌గా వ్యవహరించవద్దని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై సుప్రీంకోర్టు అణు క్షిపణి ప్రయోగించాలనుకోవడం సమంజసం కాదని చెప్పారు. పరిశీలన కోసం రాష్ట్ర గవర్నర్లు పంపించిన బిల్లులపై నిర్ణయం తీసుకొనే విషయంలో రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం పట్ల జగదీప్‌ ధన్‌ఖడ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. 

ఇది నిజంగా ఆందోళనకరమని అన్నారు. ఇలాంటి పరిణామం కోసం మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదన్నారు. సుప్రీంకోర్టుకు అలాంటి ఆదేశాలిచ్చే అధికారం ఎక్కడిదని ఆక్షేపించారు. గురువారం రాజ్యసభలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థ చేయాల్సిన పనులను న్యాయ వ్యవస్థ చేయాలనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ దేశంలో ఏం జరుగుతోంది? అని నిలదీశారు.

 ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తాను ఏనాడూ ఊహించలేదన్నారు. సుప్రీంకోర్టు సూపర్‌ పార్లమెంట్‌గా వ్యవహరిస్తూ ఏకంగా రాష్ట్రపతికే ఆదేశాలు జారీ చేయడం సరైంది కాదన్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ సుప్రీంకోర్టుకు అలాంటి అధికారాలు ఇవ్వలేదని ఉద్ఘాటించారు. న్యాయ వ్యవస్థకు చట్టాలు వర్తించడం లేదని, అందుకే పారదర్శకత కనిపించడం లేదని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ హద్దులు దాటుతోందని విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 కింద సుప్రీంకోర్టుకు ఇచ్చిన ప్లీనరీ అధికారాలు.. నిత్యం ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రయోగించడానికి న్యూక్లియర్‌ మిస్సైల్‌గా మారాయని వ్యాఖ్యానించారు.

నోట్లకట్టల ఘటనలో ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయలేదు? 
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో మార్చి 14న నోట్ల కట్టలు దొరికిన ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయలేదని జగదీప్‌ ధన్‌ఖడ్‌ ప్రశ్నించారు. న్యాయమూర్తులు విచారణకు అతీతమా? అని ప్రశ్నించారు. వారికి అలాంటి వెసులుబాటు ఉందా? అని అడిగారు. సాధారణ పౌరుల ఇంట్లో నగదు దొరికి ఉంటే దర్యాప్తు ఎలక్ట్రానిక్‌ రాకెట్‌ వేగంతో జరిగేదని చెప్పారు. యశ్వంత్‌ వర్మ విషయంలో దర్యాప్తు కనీసం ఎడ్లబండి వేగంతోనూ జరగడం లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రత అనేది దర్యాప్తు నుంచి రక్షణ పొందడం కాకూడదని తెలిపారు.    
 

Advertisement
 
Advertisement
Advertisement