
ఢిల్లీ: ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్‌ను ప్రపంచ దేశాల్లో ఎండగట్టేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష నేతల్లో కేంద్ర ప్రభుత్వం తనను ఎంపిక చేయడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సమర్థించుకున్నారు. తాను కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏ రాజకీయ కోణంలో చూడడం లేదు. ఇది దేశానికి సేవ చేయాల్సిన సమయం’ అని స్పష్టం చేశారు.
ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్ తీరును ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా ప్రపంచ దేశాల్లో ఎండగట్టడానికి, ఉగ్రవాదంపై భారత్ వైఖరిని వివరించడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష నేతలతో ఏడు బృందాలు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రతిపాదించిన నాలుగు పేర్లను పక్కనపెట్టి, ఆ పార్టీ ఎంపీ శశి థరూర్‌ను ఎంపిక చేయడం సంచలనాత్మకంగా మారింది. అంతేకాకుండా ఓ బృందానికి శశి థరూర్ నేతృత్వం వహిస్తారని ప్రకటించడం గమనార్హం. ఈ ఎంపికపై శశిథరూర్ స్పందించారు.
‘మాజీ విదేశాంగ వ్యవహారాల శాఖ అనుభవం కారణంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తాను ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాలని అడిగారు. కిరణ్ రిజిజు అడిగిన వెంటనే నేను అందుకు అంగీకరించాను. ఇది దేశ సేవకు సంబంధించింది. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఒక పౌరుడిని సహాయం కోరితే ఇంకేం సమాధానం ఇవ్వాలి?అని ప్రశ్నించారు.
తాను తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ అసంతృప్తిగా ఉందా? అన్న ప్రశ్నకు ఆ విషయం పార్టీకి, కేంద్రానికి సంబంధించింది. మీరు కాంగ్రెస్‌ను అడగాలి’ అని సూచించారు. పార్టీ మిమ్మల్ని అవమానించిందా? అన్న ప్రశ్నకు.. నన్ను అంత తేలికగా అవమానించలేరు. నా విలువ నాకు తెలుసని సమాధానమిచ్చారు.
దేశంపై దాడి జరిగినప్పుడు, అందరం ఒకే స్వరం వినిపించడం, ఐక్యతగా నిలబడటం దేశానికి మంచిది. కేంద్రం ఆయనను దేశ ప్రతినిధిగా ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.