ముంబై: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఇటువంటి తరుణంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం (ఈసీ) తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరులను తప్పుదోవ పట్టిస్తూ (గ్యాస్‌లైటింగ్), ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు కారణంగానే మన ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని రాహుల్ ఆరోపించారు.
‘ఓటు చోరీ అనేది ముమ్మాటికీ దేశద్రోహ చర్యే’ అంటూ రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహారాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతున్న వేళ, ప్రజాస్వామ్య విలువల పతనంపై రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. కాగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ-శివసేన (మహాయుతి) కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, మహాయుతి కూటమి దాదాపు 52 వార్డుల్లో ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ 35 స్థానాల్లో, ఏక్‌నాథ్ షిండే వర్గపు శివసేన 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 22 స్థానాల్లో, రాజ్ థాకరేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్) 8 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 4 స్థానాల్లో మాత్రమే ఆధిక్యాన్ని కనబరుస్తూ వెనుకబడిపోయింది. అయితే అధికారిక ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంకా వెల్లడించాల్సి ఉంది. కాగా ముంబై నగరానికి అత్యంత కీలకమైన ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సుదీర్ఘ విరామం తర్వాత జరిగాయి. చివరిసారిగా 2017లో బీఎంసీ ఎన్నికలు జరగగా, అప్పుడు ఎన్నికైన మేయర్ కిషోరి పెడ్నేకర్ పదవీకాలం 2022 మార్చితోనే ముగిసింది. ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ఎన్నికలు జరగడం, నాలుగేళ్ల తర్వాత ముంబై నగరానికి కొత్త మేయర్ రాబోతుండటంతో ఈ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


