
వాయుసేనలో తొమ్మిది మందికి, ఆర్మీలో నలుగురికి వీర్‌చక్ర ప్రకటించిన రాష్ట్రపతి
వింగ్ కమాండర్ అభిమన్యు సింగ్‌కు శౌర్య చక్ర
న్యూఢిల్లీ: ముష్కరమూకల స్థావరాలను నేలమట్టంచేసి భారత సైనిక సత్తాను చాటిన ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా అమలుచేసిన తొమ్మిది మంది వాయుసేన పైలెట్లకు భారత ప్రభుత్వం వీర్‌చక్ర పురస్కారం ప్రకటించింది. సర్వసైన్యాధ్యక్ష హోదాలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పలువురికి గ్యాలంట్రీ అవార్డ్‌లను ప్రకటించారు. యుద్ధకాలంలో ఇచ్చే మూడో అత్యున్నత గ్యాలంట్రీ అవార్డ్ అయిన వీర్‌చక్రను వాయుసేనకు చెందిన తొమ్మిది మంది పైలెట్లకు ప్రకటించారు.
గ్రూప్ కెప్టెన్లు రంజిత్ సింగ్ సిధూ, మనీశ్ అరోరా, అనిమేశ్ పట్నీ, కునాల్ కల్రాలకు వీర్‌చక్ర ప్రకటించారు. వింగ్ కమాండర్ జోయ్ చంద్ర, స్వాడ్రాన్ లీడర్లు సర్థాక్ కుమార్, సిద్ధాంత్ సింగ్, రిజ్వాన్ మాలిక్, ఫ్లయిట్ లెఫ్టినెంట్ ఏఎస్ ఠాకూర్‌లకూ వీర్‌చక్ర ప్రకటించారు. ఆర్మీ తరఫున కల్నల్ కోశాంగ్ లాంబా, లెఫ్టినెంట్ కల్నల్ సుశీల్ బిష్ట్, నాయిబ్ సుబేదార్ సతీశ్ కుమార్, రైఫిల్‌మ్యాన్ సునీల్ కుమార్‌లకూ వీర్‌చక్ర దక్కింది. యుద్ధకాల గ్యాలంట్రీ అవార్డుల్లో పరమ్ వీర్‌చక్ర, మహావీర్ చక్ర తర్వాత వీర్‌చక్రను మూడో అత్యున్నత అవార్డ్‌గా పరిగణిస్తారు.
గ్యాలంట్రీ అవార్డ్‌ల జాబితాను గురువారం మోదీ ప్రభుత్వం విడుదలచేసింది. మేలో పాక్‌నుంచి దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను ఎస్–400 గగనతల రక్షణవ్యవస్థ సాయంతో నేలకూల్చిన భారతవాయుసేన సిబ్బందికి సైతం గ్యాలంట్రీ అవార్డ్‌లు దక్కాయి. మరికొందరికి సర్వోత్తమ్ యుద్ధ సేవా మెడళ్లను ప్రకటించారు. పాక్‌లోని లష్కరే తోయిబా ఉగ్రస్థావరాలను నేలమట్టంచేసిన సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్,
వెస్టర్న్ ఎయిర్ కమాండ్‌లకు సారథ్యం వహించిన ఎయిర్ మార్షల్ నగేశ్ కపూర్, ఎయిర్ మార్షల్ జీతేంద్ర మిశ్రాలకూ సర్వోత్తమ్ యుద్ధసేవా మెడల్‌ను ప్రకటించారు. కేవలం వింగ్ కమాండర్ అభిమన్యు సింగ్‌కు మాత్రమే శౌర్య చక్ర ఇచ్చారు. మొత్తంగా భారతవాయుసేన నుంచి నలుగురికి సర్వోత్తమ్ యుద్ధ సేవా మెడల్, నలుగురికి ఉత్తమ్ యుద్ధసేవా మెడల్, తొమ్మిది మందికి వీర్ చక్ర, ఒకరికి శౌర్య చక్ర, 13 మందికి యుద్ద సేవా మెడళ్లు, 26 మందికి యువసేవా మెడళ్లు, 162 మందికి ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్నందుకు ‘మెన్సన్–ఇన్–డెస్పాచెస్’ దక్కాయి. రాష్ట్రపతి ముర్ము మొత్తంగా 127 గ్యాలంట్రీ అవార్డ్‌లు ప్రకటించారు.